పథకాల లబ్దిదారులపై వైకాపా ఆశలన్నీ... : చంద్రబాబుకు తేల్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్

ఆదివారం, 24 డిశెంబరు 2023 (13:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని అందువల్ల ఆ పార్టీకి పరాభవం తప్పదంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసినట్టు సమాచారం. విజయవాడలోని ఉండవల్లి నివాసంలో చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ శనివారం కలిసిన విషయం తెల్సిందే. ఈ సమావేశంలో నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. 
 
గత కొంతకాలంగా సీఎం జగన్ పాలన, విధానాలపై ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. అదేసమయంలో ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్‌తో సహా సహచరులు శంతను సింగ్‌, శ్రీకాంత్‌, లోకేశ్‌ పాదయాత్రకు సమన్వయకర్తగా వ్యవహరించిన కిలారు రాజేశ్‌ కూడా ఈ బృందంతో ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై తన అంచనాలను చంద్రబాబుకు పీకే వివరించినట్లు తెలిసింది. 
 
ముఖ్యంగా, 'ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా కొరవడటంతో యువత జగన్‌ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత విస్తరించడంలో యువతే కీలకం. విపరీతంగా పెరిగిన ధరలు, ఏటికేడాది పెరుగుతూ పోతున్న కరెంటు చార్జీలు, పన్నుల బాదుడు పేద, మధ్య తరగతి ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవడం, రోడ్లు కూడా వేయలేని దుస్థితి ప్రభుత్వ పరపతిని బాగా దెబ్బ తీశాయి. ఈ ప్రభుత్వంలో అహంకారం, రౌడీయిజం పెరిగిపోయాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాపించింది. పథకాల లబ్ధిదారులు తమను బయటపడేస్తారన్న ఒకేఒక్క ఆశతో వైసీపీ ఉంది. కేవలం ఒకే ఒక్క ఆశ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీని గెలిపించలేదు. అయినా ఎన్నికల వ్యూహపరంగా బలంగా ఉండాలి. ఎత్తుగడల్లో వేగం ఉండాలి' అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నట్లు తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు