బాలకృష్ణ గుడివాడ నుంచి పోటీ...? జూ.ఎన్టీఆర్ కు షాక్...

బుధవారం, 9 ఏప్రియల్ 2014 (16:32 IST)
WD
హిందూపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నట్టు లెజెండ్ సక్సెస్ యాత్రలో చెప్పిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' విజయ యాత్ర సందర్భంగా ఈ ప్రకటన చేసినా బాలయ్యను గుడివాడ నుంచి రంగంలోకి దింపితే ఎలా ఉంటుందన్న యోచనలో బావ చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో లెజెండ్ నట సింహం బాలకృష్ణ 2014 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

బాలయ్యను గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తెదేపా నుంచి జంప్ చేసి కొడాలి నాని రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. కొడాలి జూ.ఎన్టీఆర్ కు బాగా దోస్త్. ఈ నేపధ్యంలో జూ.ఎన్టీఆర్ మనిషిగా పేరున్న కొడాలి నానిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలంటే అక్కడ బాలయ్యను దింపితేనే కరెక్టుగా ఉంటుందని తెదేపా శ్రేణులు అంటున్నాయి.

మరోవైపు ఇవాళ సీమాంధ్ర తెదేపా తొలి జాబితాను ప్రకటించిన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ పోటీపై ఆయనతోనే మాట్లాడతానని చెప్పారు. బాలకృష్ణతో చర్చించి ఎక్కడ నుంచి పోటీ చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఈ నేపధ్యంలో రేపు సీమాంధ్ర అభ్యర్థుల రెండో జాబితా విడుదలలో బాలకృష్ణను ఎక్కడ నుంచి పోటీకి దింపుతారన్న అంశం ఆసక్తిగా మారింది.

మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ నటరత్న స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మస్థలమైన నిమ్మకూరు నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం లోకేష్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. మరి సీమాంధ్రలో తెదేపా ఏ మేరకు సీట్లను సాధిస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి