ధన త్రయోదశి. ధన త్రయోదశి నాడు ఇంటి ముంగిళ్ళలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంటికొస్తుంది, యముడు మీ వైపు చూడడు. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఈ పర్వదినానికే ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి.