సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని రంగాలలోను విజయం పొందాలని ఆకాంక్షిస్తుంది. సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి రాఖీకి సిద్ధపడతారు.
రాఖీని కట్టేటప్పడు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల` అనే స్తోత్రాన్ని చదువుతారు. ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బలిచక్రవర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇతణ్ని అన్ని కాలాలలోనూ విడవకుండా ఉండు అని దీని అర్థం.