ఫిపా వరల్డ్ కప్ : కన్నీటిపర్యంతమైన మొరాకో ఆటగాళ్లు.. ఎందుకు?

శనివారం, 16 జూన్ 2018 (09:34 IST)
సెయింట్‌పీటర్స్‌బర్గ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ అనంతరం మొరాకో ఆటగాళ్ళు మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యారు. ఆయాచిత గోల్‌తో ఇరాన్ గెలుపును సొంతం చేసుకోవడంతో మొరాకో ఆటగాళ్లు ఘొల్లుంటూ ఏడ్చేశారు. ఆ మ్యాచ్ వివరాలను పరిశీలిస్తే...
 
ఇరాన్ ‌- మొరాకో మధ్య జరిగిన గ్రూప్‌-బి తొలి మ్యాచ్‌ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం సంచలన రీతిలో వెలువడింది. మ్యాచ్ మరికొన్ని క్షణాల్లో డ్రాగా ముగుస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అంతలోనే ఏదో మాయ జరిగిపోయింది. 
 
వాస్తవానికి మ్యాచ్‌ నిర్ణీత సమయం అయిపోయినా.. 6 నిమిషాల అదనపు సమయం పాటు మ్యాచ్ కొనసాగుతోంది. అదికూడా ముగిసే సమయంలోనే ఇరాన్‌ మిడ్‌ఫీల్డర్‌ ఎహ్‌సాన్‌ హజీ సఫీ కొట్టిన ఫ్రీకిక్‌.. మొరాకో గోల్‌పోస్ట్‌ నుంచి పక్కగా వెళ్లగా దానిని మొరాకో సబ్‌స్టిట్యూట్‌ అజీజ్‌ బౌహాతౌజ్‌ తలతో అడ్డుకున్నాడు. 
 
అయితే ఆ బంతికాస్త దిశ మార్చుకొని మొరాకో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లడంతో ఆయాచిత గోల్‌తో లభించింది. దీంతో ఇరాన్‌ విజయాన్ని అందుకోగా, ఆ జట్టు ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు అనుకోని ఈ ఉదంతంతో మొరాకో కన్నీటిపర్యంతమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు