ఫిఫా నాకౌట్ పోటీల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లో జరిగిన పోటీలో స్వీడెన్ జయభేరి మోగించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మంగళవారం (జులై-3) జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0 గోల్ తేడాతో స్వీడెన్ గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. దీంతో 24 ఏళ్ల తర్వాత మొదటి సారిగా స్వీడన్ క్వార్టర్స్ ఫైనల్‌కి చేరుకుంది. ఆద్యంతం రెండు జట్లు గోల్ చేసేందుకు పోటీపడినా ఫలితం లేకుండా పోయింది.
హాఫ్ టైమ్ గడిచేసరికి స్కోరు 0-0గా ఉంది. మొదటి 28 నిమిషాల్లో స్వీడన్ ఆటగాడు మార్కస్ బెర్గ్ 13 షాట్లు కొట్టి గోల్‌కోసం ప్రయత్నించాడు. బ్రేక్ తర్వాత ఇరు జట్లు పోటాపోటీగా సాగాయి. ఆట 66వ నిమిషంలో స్వీడన్ గోల్ చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్వీడన్ మిడ్ ఫీల్డర్ టయ్వోనిన్ అందించిన పాస్‌ను ఎమిల్ ఫోర్స్‌బెర్గ్ గోల్ చేశాడు.
తద్వారా ప్రపంచకప్ టోర్నీల్లో ఎమిల్కిది మొదటి గోల్. నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యే సరికి 1-0తో స్వీడన్ ఆధిక్యంలో ఉంది. అదనపు ఏడు నిమిషాల ఆటలో స్వీట్జర్లాండ్ ఆటగాడు మైకేల్ లాంగ్ రెడ్ కార్డ్ పొందడంతో గ్రౌండ్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఆటలో స్వీడన్ ఒక ఎల్లో కార్డు పొందగా, స్విట్జర్లాండ్ రెండు ఎల్లో కార్డులు, ఒక రెడ్ కార్డ్ పొందింది. ఇప్పటివరకు ఏడు సార్లు నాకౌట్లోకి ప్రవేశించినప్పటికి స్విట్జర్లాండ్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.