ప్రస్తుతం 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న వారికి 5 శాతం టీడీఎస్ ఉంది. అలాగే 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న ఉద్యోగులకు 20 శాతం వరకూ టీడీఎస్ ఉంది. సంవత్సరానికి పది లక్షల రూపాయలకు మించి జీతం ఉన్న వారికి 30 శాతం టీడీఎస్ ఉంది. ఈ తరుణంలో 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఒప్పంద, వృత్తిగత ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషన్, బ్రోకరేజ్ మొదలైనవి ఈ తగ్గిన రేటుకు అర్హులు. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఆర్థిక సంవత్సరం 31, మార్చి 2021 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. 25 శాతం తగ్గింపుతో ప్రజలకు రూ.50 వేల కోట్ల మేర లబ్ది చేకూరి నగదు లభ్యతకు ఆస్కారం ఉంటుందన్నారు.
అలాగే, 15 వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం ఇవ్వనుంది. మూడు నెలల పాటు ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేసే 72 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు.