#FlashBack2020 : పంథా మార్చిన టాలీవుడ్ హీరోయిన్లు!

గురువారం, 24 డిశెంబరు 2020 (21:14 IST)
కాల చక్రంలో మరో సంవత్సరం కలిసిపోనుంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోయిన 2020 సంవత్సరం మరికొన్ని రోజుల్లో చరిత్రపుటలకు పరిమితంకానుంది. అయితే, ఈ యేడాది చిత్రపరిశ్రమకు అపారనష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ.. ఈ యేడాది హీరోయిన్ల మధ్య ఎక్కువ పోటీ నెలకొంది. 
 
సాధారణంగా ప్రతి ఏడాది ఎందరో ఔత్సాహిక నాయికలు చిత్రసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక్కడ జాతకాలు తారుమారు కావడానికి ఎంతో సమయం పట్టదు. ఈ పోటీ కారణంగా నాయికలు కెరీర్‌, సినిమా ఎంపిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. తమ స్టార్‌డమ్‌కు అనుగుణంగా సినిమాల్ని ఎంచుకుంటుంటారు.
 
అయితే ప్రస్తుతం ఈ ధోరణిలో మార్పు కనిపిస్తోంది. కథానాయికలు పోటీ తత్వాన్ని పక్కనపెట్టి కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ వెండితెరను పంచుకుంటున్నారు. కథలో కొత్తదనం ఉందనిపిస్తే అగ్ర కథానాయికలు ఇమేజ్‌ పట్టింపులు లేకుండా వర్ధమాన నాయికలతో కలిసి నటించడానికి సిద్ధమంటున్నారు. దీంతో  తెలుగులో మల్టీహీరోయిన్‌ సినిమాల రూపకల్పన ఎక్కువవుతోంది. ఓరకంగా ఈ ట్రెండ్‌ పరిశ్రమకు మంచే చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
 
ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ నటీమణులుగా నయనతార, సమంతలు కొనసాగుతున్నారు. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు, వైవిధ్యత కలబోసిన పాత్రలతో ప్రతిభను చాటుతూ నవతరం నాయికల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ ఇద్దరు స్టార్స్‌ తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో తమిళ చిత్రంలో కనిపించనున్నారు. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 
మూడు తరాల కలయికలో..
మూడు తరాల కథానాయికల కలయికకు తమిళ చిత్రం అన్నాత్తై. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్య కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తిసురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాయికల పాత్రలన్నీ కథలో ప్రాముఖ్యత కలిగి ఉండి శక్తివంతంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. లాక్డౌన్‌కు ముందు 70 శాతం చిత్రీకరణ పూర్తిచేశారు. మిగతా షూటింగ్‌ను ఈ నెల 15 నుంచి ప్రారంభంకాగా, యూనిట్‌లోని ఏడుగురికి కరోనా వైరస్ సోకడంతో చిత్రం షూటింగును నిలిపివేశారు. 
 
అదేవిధంగా 1990, 2000 దశకం నాటి కథానాయికలు కలిసి ‘విరాటం పర్వం’లో కనిపించబోతున్నారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందితాదాస్‌, ప్రియమణి, సాయిపల్లవి, నివేదా పెతురాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రియమణి, సాయిపల్లవి నక్సలైట్స్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. నందితదాస్‌ సామాజిక వేత్తగా నటిస్తున్నట్లు తెలిసింది.
 
మహిళా శక్తిని చాటిచెప్పేలా ప్రతి పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ అంథాలజీ చిత్రం ‘పావ కదైగల్‌'లో సిమ్రాన్‌, అంజలి, సాయిపల్లవి, కల్కి కొచ్లిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమ, కుటుంబ గౌరవం, పరువు లాంటి అంశాలు మానవ సంబంధాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
ఈ యేడాది ఎక్కువగా చెప్పుకోవాల్సిన హీరోయిన్లు రష్మిక మందన్నా.. పూజా హెగ్డే. వీరిద్దరే లక్కీ గర్ల్స్. తమ అందచందాలతో పాటు అభినయంతో దక్షిణాది ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తున్న ముద్దుగుమ్మలు ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడటానికి రెండు కన్నులు సరిపోవు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.
 
1964 నేపథ్యంలో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, రష్మిక మందన్న కథానాయికలుగా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథతో పాటు తమ పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత నచ్చడంతో ఈ అగ్రకథానాయికలిద్దరూ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. దుల్కర్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రాబోతున్నది. 
 
అదేవిధంగా పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌సాబ్‌'. బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నలుగురు కథానాయికలు నటిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ సరసన శృతిహాసన్‌ నటిస్తుండగా, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కోర్ట్‌రూమ్‌ డ్రామాకు యాక్షన్‌ అంశాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు