ఏడు వారాల నగలంటే ఏమిటి?

ఆదివారం, 26 మే 2013 (16:34 IST)
File
FILE
పూర్వం రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం ఏడు రోజుల్లో ఏడు రకాల నగలు ధరించే వారు. వాటినే ఏడు వారాల నగలు అనేవారు. ఈ పదం ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. అసలు ఏడు వారాల నగలంటే ఏంటి అనే అంశంపై వాస్తు నిపుణులను అడిగితే...

పూర్వం రోజుల్లో స్త్రీలు వారం రోజులూ ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం, ఆరోగ్యం కోసం బంగారు ఆభరణాలు ధరించేవారని, వాటినే ఏడువారాల నగలు అనే వారని అంటున్నారు. వీటిని ధరించడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని స్త్రీల ప్రగాఢ విశ్వాసం. అలాంటి ఏడు వారాల నగలు అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పటికీ చాల మంది మహిళల్లో ఉందంటున్నారు.

ఆదివారం రోజు సూర్యానుగ్రహం కోసం కెంపు వర్ణం కమ్మలు, హారాలను ధరిస్తారు. సోమవారం రోజున చంద్రుని అనుగ్రహం కోసం ముత్యాల హారాలు, ముత్యాలు పొదిగిన బంగారు గాజులను, మంగళవారం రోజున కుజుని అనుగ్రహం కోసం పగడాల దండలు, పగడాల ఉంగరాలను ధరిస్తారు.

అలాగే, బుధవారం రోజున బుద్ధుని అనుగ్రహం కోసం పచ్చల పతకాలు, గాజులు ధరిస్తారు. గురువారం రోజు బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగం, కమ్మలు, ఉంగరాలను, శుక్రవారం శుక్రుని అనుగ్రహం కోసం వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక, శనివారం రోజున శని గ్రహం అనుగ్రహం కోసం నీలమణి హారాన్ని ధరిస్తారని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి