కుంభ, మీనలగ్న జాతకులు ఎలాంటి రత్నాలు ధరించాలన్నది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. కుంభలగ్న జాతకులకు శని లగ్న వ్యయాధిపతి. కాబట్టి వెండిలో నీలము పొదిగించి ధరించగలర. అలాగే జాతిపచ్చను, వజ్రమును కూడా పసిడిలో పొదిగించుకుని ధరించవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అయితే ఈ జాతకులకు రవి సప్తమాధిపతి కావున కెంపును మాత్రం ధరించరాదు. గురువు ద్వితీయ ఏకాదశపతి కావున కనకపుష్యరాగాన్ని ధరించకూడదు. ఇంకా కుజుడు తృతీయ దశమాధిపతి కావడం చేత పగడాన్ని ధరించకూడదు.
మీనలగ్నములో జన్మించిన జాతకులకు చంద్రుడు పంచమాధిపతి. కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ధరించగలరు. కుజుడు నవమాధిపతి, గురువు లగ్న దశమాధిపతి కావున పగడమును వెండిలో గానీ, కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని ధరించవచ్చు.
ఇక మీనలగ్నకారులకు బుధుడు సప్తమాధిపతి కాబట్టి పచ్చను ధరించడం కూడదు. శని, ఏకాదశ, ద్వాదశాధిపతి కావడంతో నీలమును కూడా ధరించకూడదు. శుక్రుడు తృతీయ అష్టమాధిపతి కావడంతో వజ్రమును కూడా ధరించకూడదని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.