మీరు మకరరాశి జాతకులా..? అయితే నవరత్నాలలో నీలరత్నాన్ని ధరించడం శ్రేష్టమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. సృజనాత్మకత, ధైర్యవంతులు, పట్టుదల గలవారుగా ఉండే వీరు.. నీలరత్నాన్ని ధరించడం ద్వారా ముఖకాంతి, నేత్రకాంతిని పెంపొందింపజేసుకోవచ్చునని రత్నాల శాస్త్రం అంటోంది.
ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి కావున, ఈ రాశిలో జన్మించిన జాతకులు తప్పకుండా నీలమును ధరించాలి. ఇంద్రనీలము, మయూర నీలము, నీలమణి అనే మూడు రకాల్లో రత్నాల శాస్త్ర నిపుణులను సంప్రదించి మకరరాశి జాతకులు ధరించడం ఎంతో మంచిది.
ఆంగ్లంలో సెఫైర్ అనే పిలువబడే ఈ రత్నమును ధరించడం ద్వారా శని గ్రహదోషాలను, ఏలినాటి శని దోషాలను నివారించవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా రాత్రిపూట వచ్చే భయానక కలలను కూడా నివారిస్తుందని వారు చెబుతున్నారు.
ఆయుషు, బలము, బుద్ధి వృద్ధిచెందడం, అకస్మాత్తుగా జరిగే దొంగతనం, దుర్ఘటనలు వంటివి జరగకుండా నివారించేందుకు నీలరత్నాన్ని ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది.
నీలాన్ని కనుగొనడం ఎలా..? నీలము పల్చగా, స్వచ్ఛమైన మెరుపు కలిగి ఉంటుంది. ఎక్కువ శుభ్రముగా ఉండని ఈ రత్నము ఛారలు కలిగి ఉంటుంది. అసలైన నీలమును నీరు నింపిన గాజు గ్లాసులో వేస్తే ఆ నీటి నుండి నీల కిరణాలు వెలువడుతాయి. ఇంకా అసలైన నీలాన్ని ఎండలో ఉంచితే నీలపు కిరణాలు వస్తాయి.
ఎలా ధరించాలంటే...? శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. ఎడమచేతి మధ్యవేలుకు ధరించాలి. వెండిలోహముతో పొదిగించుకుని ధరించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ధరించే ముందు గంగాజలములోగానీ, పాలులోగానీ శుద్ధి చేయాలి. ధరించే ముందు శని ధ్యాన శ్లోకమును 190 సార్లు ధ్యానించడం మంచిది.