చూస్తే నత్తలా ఉంటుంది.. లోపలేమో పీత.. ఏంటది..?

FILE
పిల్లలూ..! ఇది చూసేందుకేమో నత్తలాగా ఉంటుంది. కానీ లోపల ఉండేది మాత్రం పీత. ఏమయి ఉంటుందో అని ఆలోచిస్తున్నారు కదూ..? దాని పేరే "హెర్మిట్" పీత. ఇది మామూలు పీతే అయినప్పటికీ.. నత్తగుల్లల్ని మోస్తూ చాలా బిజీగా ఉంటుంది కాబట్టి.. అవి రెండూ కలిసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంటాయంతే..!!

నత్తలు వదిలేసిన గుల్లల్లోకి దూరిపోయే ఈ హెర్మిట్ నత్తలు వాటిలోనే జీవిస్తాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాల్లోని అట్లాంటిక్ తీరం వెంబడి ఇవి నివసిస్తుంటాయి. అయితే చూసేందుకు ఇవి పీతల్లాగా ఉంటాయికానీ పూర్తిగా ఆ జాతికి చెందినవి మాత్రం కాదు. పీతలకు కాస్త దగ్గరి బంధువులు మాత్రమే.

సుమారు 500 రకాల జాతులున్న ఈ హెర్మిట్ పీతల్లో.. కొన్ని రకాలు నేలమీద కూడా హాయిగా బ్రతికేస్తుంటాయి. ఇక వీటి శరీరం ఎలా ఉంటుందంటే.. మెత్తగా ఉండి ఎటు కావాలంటే అటు వంగేటట్లుగా ఉంటుంది. అందుకే నత్తలు వదిలేసిన గుల్లలకంటే తమ శరీరాలు కాస్త పెద్దగా ఉన్నా సరే.. ఎలాగోలా కష్టపడి వాటిల్లోకి దూరేస్తుంటాయి.

ఆరుకాళ్లని, తలను మాత్రం బయటవైపు ఉంచుకుని, మిగతా శరీరాన్నంతా నత్తగుల్లల లోపలికి తోసేవేసి ఎంచక్కా తిరిగేస్తుంటాయివి. కొన్నాళ్లకి వీటి శరీరం బాగా పెరిగి ఆ గుల్ల బిగుతుగా తయారైతే.. మరో పెద్ద నత్తగుల్లని వెతికి పట్టుకుని మరీ అందులోకి బిచాణా సర్దేస్తుంటాయి. ఇకపోతే.. ఈ హెర్మిట్ పీతలకు నత్తగుల్లలను అన్వేషించటం అంటే భలే సరదా సుమండీ..! ఎంతలా అంటే.. ఓ మంచి నత్తగుల్ల కనిపిస్తే రెండు, లేదా మూడు పీతలు పోటీపడి మరీ పోట్లాడుకుంటాయి.
సీ అనీమోన్‌తో భలే స్నేహం..!
"సీ అనీమోన్" అనే జీవితో దీనికి బోలెడంత స్నేహమట పిల్లలూ..? అందుకనే దానిని వీపుమీదకి ఎక్కించుకుని సముద్రమంతా తిప్పుతుంటుందట. ఎందుకంటే, సీ అనీమోన్‌కు విషంతో కూడిన టెంటకిల్స్ ఉంటాయి కాబట్టి.. దీని దగ్గరకు ఏ చేపకూడా వచ్చేందుకు సాహసం చేయదు...


హెర్మిట్ పీతల్లో 13 మిల్లీ మీటర్ల పరిమాణం ఉండే చిన్నసైజు నుంచి 121 మిల్లీ మీటర్ల పరిమాణం ఉండే పెద్ద పీతలదాకా ఉంటాయి. ఇంతకీ ఇది నత్తగుల్లల్లో ఎందుకు దూరుతుందని అనుకుంటున్నారు కదూ..? మరేంలేదు తననుతాను రక్షించుకునేందుకే అలాంటి ఏర్పాటు చేసుకుంటుందన్నమాట.

"సీ అనీమోన్" అనే జీవితో దీనికి బోలెడంత స్నేహమట పిల్లలూ..? అందుకనే దానిని వీపుమీదకి ఎక్కించుకుని సముద్రమంతా తిప్పుతుంటుందట. ఎందుకంటే, సీ అనీమోన్‌కు విషంతో కూడిన టెంటకిల్స్ ఉంటాయి కాబట్టి.. దీని దగ్గరకు ఏ చేపకూడా వచ్చేందుకు సాహసం చేయదు.

ఇలాంటి స్నేహితుడు తన దగ్గరుంటే మరే జీవీ తనమీద దాడి చేయదని హెర్మిట్ పీత ధైర్యం కాబోలు..! అంతేకాదు ఇది కొన్ని రకాల పాముల్లాగా కూడా పై పొరను కుబుసంలాగా విడిచేస్తుంది. ఇలా చేయటంవల్ల దీనికి పాముల్లాగే మళ్లీ కొత్తపొర వస్తుంది. ఇక్కడ విచిత్రమేంటంటే... ఇది తాను వదిలేసిన పాత పొరని తానే ఎంచక్కా గుటుక్కుమనిపిస్తుంది.

మొత్తం పదికాళ్లున్న హెర్మిట్ పీత ఆరు కాళ్ల సాయంతో నడుస్తూ, మిగతా వాటిని గుల్ల లోపల దాచేస్తుంది. ఆడ హెర్మిట్ పీతలు ఒకేసారి బోలెడన్ని గుడ్లను పెడుతుంటాయి. అయితే వాటిని నత్తగుల్లల్లోపల దాచుకున్న పొట్ట దగ్గరే ఉంచుకుని హాయిగా పిల్లల్ని కనేస్తాయి. నత్తగుల్లను రక్షణ కవచంలాగా.. సీ అనీమోన్‌ను స్నేహితుడిగా చేసుకుని చిత్ర విచిత్రాలు చేస్తున్న హెర్మిట్ పీతల కథ భలే తమాషాగా ఉంది కదూ పిల్లలూ..!!

వెబ్దునియా పై చదవండి