"నీటి గుర్రాలు" అంటే..? అవి ఎలా ఉంటాయి..?

పిల్లలూ...! నీటి గుర్రాలు గురించి మీరెప్పుడైనా విన్నారా..? వీటినే "హిప్పోపొటమస్"లని కూడా అంటారు. ఆఫ్రికా దేశానికి చెందిన ఈ నీటిగుర్రాలు ఉభయచర జీవులు. అంటే భూమిమీద, నీళ్లలోనూ జీవించే జంతువులన్నమాట.

పెద్ద ఆకారంతో చూడగానే భయపెట్టేలా ఉండే ఈ నీటి గుర్రాలు ఎక్కువ కాలం నీటిలోనే గడుపుతాయి. కేవలం ముక్కు మాత్రమే కనిపించేలా అవి నీటిలో గంటల తరబడీ గడుపుతాయి. చూసేందుకు భయపెట్టేలా ఉన్నప్పటికీ ఇవి శాకాహారం మాత్రమే తీసుకుంటాయి.

రాత్రి సమయాల్లో నీటి నుంచి బయటకు వచ్చే ఈ నీటి గుర్రాలు... పచ్చికను మేస్తాయి. మగ నీటి గుర్రాలు దాదాపు నాలుగు టన్నుల బరువు ఉంటాయి. అంత పెద్ద భారీ శరీరానికి పొట్టిగా ఉండే కాళ్లు కలిగిన ఈ గుర్రాలు నీటిలో సునాయాసంగా ఈదేస్తూ ఉండిపోతాయి.

పిల్లలూ... అన్నింటికంటే గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ నీటి గుర్రాలు నీటిలోనే పిల్లల్ని కంటాయట..! అలా పుట్టిన చిన్నారి నీటి గుర్రాలు నడక కంటే ముందుగా ఈదటం నేర్చుకుంటాయట..! భలే తమాషాగా ఉంది కదూ..!!

వెబ్దునియా పై చదవండి