భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఆంగ్ల రచయితలలో సాల్మన్ రష్దీ ప్రముఖులు. ఈయన పలు ఇంగ్లీషు నవలలను చక్కటి సాహితీ విలువలతో, ఆకట్టుకునే శైలితో రచించి పాఠకులకు చేరువయ్యారు. అనేక సంచలనాత్మక రచనలు చేసిన ఈయన, ప్రపంచ సాహిత్యరంగంలో భారతదేశ కీర్తిబావుటాను ఎగురవేసి అందరి ప్రశంసలను చూరగొన్నారు.
సాల్మన్ రష్దీ జీవిత విశేషాల్లోకి ఓసారి తొంగి చూస్తే... మహారాష్ట్రలోని బొంబాయి (నేటి ముంబై) నగరంలో 1947 జూన్ 19వ తేదీన అహమద్ సాల్మన్ రష్దీ జన్మించారు. రష్దీ తండ్రి వ్యాపారస్తుడు కాగా, తల్లి గృహిణి. పాఠశాల విద్యను ముంబైలోని కాథడ్రెల్ మరియు జాన్ కానన్ పాఠశాలలోనూ, ఆ తరువాత రగ్బీ స్కూల్లోనూ పూర్తి చేశారు.
బుకర్ అవార్డు విన్నర్‌గా...!
ఆధునిక భారతదేశంలోని పరిస్థితులను గురించి వర్ణిస్తూ రాసిన ఈ నవల రష్దీకి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది. అంతేగాకుండా ఆ సంవత్సరపు బుకర్ ఫ్రైజ్ అవార్డును కూడా సంపాదించి పెట్టింది...
ఆపై కింగ్స్ కాలేజీలోనూ, తరువాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య (చరిత్ర)ను పూర్తి చేసుకున్న సాల్మన్ రష్దీ... ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో కాపీరైటర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన రచించిన తొలి నవల "గ్రీమస్" 1975వ సంవత్సరంలో ప్రచురించబడింది. అయితే ఆ నవల అంతగా గుర్తింపు పొందలేదు
తరువాత 1981లో రష్దీ రాసిన రెండవ నవల అయిన "మిడ్నైట్ చిల్డ్రన్" విశేషంగా ఆదరించబడి, ఆయనకు పలువురి ప్రశంసలు దక్కేలా చేసింది. ఆధునిక భారతదేశంలోని పరిస్థితులను గురించి వర్ణిస్తూ రాసిన ఈ నవల రష్దీకి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది. అంతేగాకుండా ఆ సంవత్సరపు బుకర్ ఫ్రైజ్ అవార్డును కూడా సంపాదించి పెట్టింది.
ఆ తరువాత 1983వ సంవత్సరంలో, పాకిస్తాన్‌లోని రాజకీయ పరిస్థితుల గురించి వర్ణిస్తూ రష్దీ "షేమ్" అన్న నవలను రచించారు. తదనంతరం 1988వ సంవత్సరంలో ఆయన రాసిన "సాటనిక్ వెర్సెస్" నవల పెద్ద సంచలనం సృష్టించింది. రష్దీ ముస్లింల మనోభావాలను కించపరిచారంటూ, పలు ఆందోళనలు వెల్లువెత్తాయి. చాలా దేశాల్లో ముస్లింల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ఈ పుస్తకాన్ని నిషేధించారు.
మహమ్మద్ ప్రవక్తను, ఇస్లాంను కించపరిచారన్న ఆరోపణతో ఇరాన్ ప్రభుత్వం సాల్మన్రష్దీకి ఏకంగా మరణదండన కూడా విధించేసింది. ఇరాన్‌కు చెందిన అయతుల్లా ఖోమైని అనే వ్యక్తి సాల్మన్రష్దీని చంపినవారికి ఆరు మిలియన్ డాలర్లు బహుమతిని ప్రకటించారు. ఇక అప్పటినుంచి రష్దీ స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల రక్షణలో బాహ్యప్రపంచానికి దూరంగా వుంటూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు.
ఆ తరువాత సాల్మన్ రష్దీ "ఇమాజినరీ హోంల్యాండ్స్" అనే వ్యాస సంకలనాన్ని, "ఈస్ట్-వెస్ట్" అనే కధా సంకలనాన్ని, "ది వింటేజ్ బుక్ ఆఫ్ ఇండియన్ రైటింగ్", "ది గ్రౌండ్ బెనీత్ హర్ ఫీట్" లాంటి రచనలను వెలువరించారు. ఈ రచనల్లో పలు ఆసక్తికర అంశాలను తడుముతూ రాసిన రష్దీ విమర్శకుల నుంచి అనేకమైన ప్రశంసలను అందుకున్నారు.
ముంబైలో జన్మించినప్పటికీ సాల్మన్ రష్దీ ఎక్కువ కాలం విదేశాల్లోనే గడిపారు. రచయితలను ప్రభావితం చేసే విధంగా ఉండే "రైటర్స్ రిసార్ట్"ను తన పూర్వీకుల స్వస్థలమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ అత్యంత సుందరంగా ఆయన నిర్మించారు.