శరీరంలో నీటి శాతం తగ్గితే ఏమవుతుంది..?

FILE
మానవ శరీరంలో రక్తంతో సహా, ప్రతి అవయవంలోనూ ఏదో ఒక రూపంలో.. పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. ఈ నీటి పరిమాణంలో కొద్దిగా హెచ్చుతగ్గులు సంభవించినట్లయితే ఫర్వాలేదుగానీ.. నీటి శాతం తగ్గిపోవడం అనేది ఒక పరిమితి దాటితే మాత్రం పరిస్థితి విషమిస్తుంది.

సాధారణంగా మన శరీరం బరువులో 12 శాతం బరువుకి సమానమైన నీటిని శరీరం కోల్పోయినట్లయితే పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతుంది. అలాంటి సమయాలలో రక్తంలోనేకాక, కండరాల్లో సైతం నీటి శాతం తగ్గిపోతుంది. ఇక రక్తం అయితే ఉండాల్సినంత నీరు లేకపోవడం మూలాన చిక్కగా మారిపోతుంది.

రక్తం చిక్కబడినట్లయితే.. అందులోని వివిధ కణాలు ఒక దానితో మరొకటి చేరి ఎక్కడికక్కడ చిన్న చిన్న గడ్డలుగా తయారవడం మొదలు పెడతాయి. ఇలాంటి గడ్డలతో కూడిన రక్తాన్ని గుండె తన ద్వారా పంపించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. పైగా ఆ పరిస్థితి గుండెకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

సాధారణంగా... వాంతులు, నీళ్ల విరేచనాలు లాంటి వ్యాధులు వచ్చినప్పుడు శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంటుంది. అందుకే అలాంటి సమయాల్లో మంచినీరు, పళ్లరసాలు, ఉప్పు చక్కెర కలిపిన ద్రావణం లేదా గ్లూకోజ్ లాంటి పదార్థాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.

అలా చేయటంవల్ల మన శరీరానికి అవసరమైన నీటిని, లవణాలను ఎప్పటికప్పుడు అందిస్తూ, పరిస్థితి చేయి దాటిపోకుండా కాపాడుకోగలుగుతారు. ఆ సంగతలా కాసేపు పక్కన పెడితే... వాంతులు, డయేరిలా లాంటి అనారోగ్య పరిస్థితుల్లోనేకాక మామూలు సమయాల్లో కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ శరీరానికి అవసరమైన తగినంత నీటిని తీసుకోవటం ఉత్తమం. ఎండాకాలంలో అయితే మరింత ఎక్కువగా నీటిని తాగాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలూ..! ప్రతిరోజూ తగినంత నీటిని తాగటం మర్చిపోరు కదూ...?!

వెబ్దునియా పై చదవండి