ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, ప్రస్తుత రాజధాని నగరం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం బలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏంటి? దాని పరిపాలనా వ్యవహారాలను ఎవరు నిర్విస్తారు? దీనికి సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతోంది? తదితర అంశాలను తెలుసుకుందాం..!
కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం పరిపాలించాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు ఉండే అధికారాలు ఉండవు. సాధారణంగా భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉండే ప్రదేశాలను, ప్రాంతాలను అంతర్ రాష్ట్ర వివాదాలవల్ల అనివార్యంగా కేంద్రం పరిపాలించాల్సిన ప్రాంతాలను మాత్రమే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారు.
కేంద్రపాలిత ప్రాంతాల పాలనా వ్యవహారాలు, బడ్జెట్ తదితర అంశాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. బడ్జెటును పార్లమెంట్ ఆమోదిస్తుంది. రాష్ట్రాలకు గవర్నర్‌లు ఉన్నట్లుగా కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తారు. అయితే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉంటుంది, ముఖ్యమంత్రి కూడా ఉంటారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఢిల్లీని చెప్పుకోవచ్చు. దీనికి ప్రస్తుతం షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మన భారత దేశంలో మొత్తం ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు.. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, పాండిచ్చేరి, యానాం, చండీఘడ్, న్యూఢిల్లీ తదితరాలు ఉన్నాయి.
దేశ ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్నందువల్ల లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. అలాగే విదేశీయుల దురాక్రమణ నుంచి స్వాధీనం చేసుకున్న తరువాత డామన్ డయ్యూను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఇది గోవాకు దూరంగా విస్తరించి ఉంది.
అలాగే గోవాకు దూరంగా విస్తరించి.. తెల్లవారి దురాక్రమణ నుంచి విముక్తమైన దాద్రా నగర్ హవేలీ కూడా కేంద్ర పాలిత ప్రాంతమే. ఫ్రెంచ్‌వారి నుంచి విముక్తం అయిన పాండిచ్చేరిని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ప్రస్తుతం దీనిపేరు పుదుచ్చేరి కాగా దీనికి శాసనసభ, ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఇక మన ఆంధ్రరాష్ట్రంలోని యానాం సైతం కేంద్ర పాలిత ప్రాంతమే. అయితే ఇది పుదుచ్చేరిలో భాగంగా ఉంది.
పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని చండీఘడ్ కూడా కేంద్ర పాలిత ప్రాంతమే. గతంలో పంజాబ్ నుంచి హర్యానా విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకాగా.. అనంతరం రాజధాని అంశమై వివాదం తలెత్తటంతో చండీఘడ్‌ను కేంద్ర ప్రాలిత ప్రాంతంగా ప్రకటించారు. చండీఘడ్ రెండు రాష్ట్రాలకూ రాజధాని అయినా, ఒప్పందం ప్రకారం దీనిని పంజాబుకు ఇచ్చారు. అయితే ఇంకా బదిలీ పూర్తి కానందువల్ల ఇది ఇప్పటికీ కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంది.
ఇక చివరిది మన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ. రాజ్యాంగం ప్రకారం న్యూఢిల్లీ దేశ రాజధాని అయినప్పటికీ వ్యావహారికంగా మాత్రం ఇది కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతోంది. అయితే ఇక్కడ శాసనసభ ఉండటమేగాకుండా, దీనికి ఓ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు.