ఎత్తైన ప్రదేశాలు దిగడం కంటే ఎక్కడం కష్టం.. ఎందుకో తెలుసా?

సోమవారం, 3 నవంబరు 2014 (17:55 IST)
సాధారణంగా ఎత్తైన ప్రదేశాలను ఎక్కడం చాలా కష్టం. కానీ సులభంగా కిందికి దిగేయవచ్చు. మేడపైకి లేదా కొండపైకి లేదా ఎత్తైన ప్రదేశంపైకి ఎక్కుతుంటే ఆయాసం, గుండెదడ, శరీరమంతా చెమటలు పట్టడం వంటివి జరుగుతుంటాయి. ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటేగానీ మరో పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచన చేద్ధాం. 
 
భౌతిక శాస్త్రం ప్రకారం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఈ కారణంగానే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నా.. మనం పడిపోకుండా నిలదొక్కుని మన పనులు మనం చక్కబెట్టుకుంటున్నాం. కానీ, కొండలు, ఎత్తైన ప్రదేశాలు ఎక్కుతున్నామంటే మనం భూమ్యాకర్షణ శక్తికి దూరంగా వెళుతున్నామనే అర్థం. న్యూటన్ సిద్ధాంతం మేరకు చెట్టుమీద నుంచి పడిన ఆపిల్.. పైకి వెళ్లకుండా కింద పడిందంటే అది భూమ్యాకర్షణ శక్తివల్లేననే విషయం ప్రతి ఒక్కరికీ తెల్సిందే. 
 
అలాగే, కొండలు, ఎత్తైన ప్రదేశం ఎక్కే సమయంలో భూమికున్న ఆకర్షణ శక్తి మనల్ని కిందకులాగుతుంది. దానిని అధికమించేందుకు మనం మరింత శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం కండరాలకు మరింత రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులు మరింత వేగంగా పని చేస్తూ కార్బన్‌డయాక్సైడ్‌ను బయటకు పంపుతూ ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివల్ల అలసట, ఆయాసం వస్తుంది. 
 
అదే మెట్లు లేదా ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు దిగేటపుడు శరీరం భూమికి ఉండే ఆకర్షణ శక్తికి అనుకూలంగా ఉంటుంది. దీంతో అధిక బలాన్ని గానీ లేదా శక్తిని గానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందువల్ల పైకి ఎక్కడం కంటే కిందకి దిగడం ఎంతో సులభం. 

వెబ్దునియా పై చదవండి