ప్రపంచంలో అతి పొట్టి వ్యక్తిగా గిన్నిస్ రికార్డును సాధించింది ఎవరు అనగానే మనకు టక్కున గుర్తు వచ్చే సమాధానం చైనాకు చెందిన "పింగ్‌పింగ్" (15 అంగుళాలు అంటే.. 38 సెంటీమీటర్లు) అనేస్తాం..! అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు పింగ్‌పింగ్ లేడు కదా... పాపం గత మార్చిలో పింగ్‌పాంగ్ అకస్మాత్తుగా మరణించాడు. దీంతో ఇప్పుడు ఈ రికార్డు మరొకరిని వరించింది.
తాజాగా ఈ గిన్నిస్ రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ "నినో హెర్నాండెజ్"ను వరించింది. ఇతను ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తు కలిగిన(జీవించి ఉన్న వారిలో) వ్యక్తిగా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాడు. నినో హెర్నాండెజ్ ముద్దు పేరు "నినో". ఇతడి ఎత్తు 27 అంగుళాలు అంటే.. 70 సెంటీమీటర్లు(ఒక చిన్న సూట్‌కేస్ అంత పొడవు), వయస్సు 24 సంవత్సరాలు, బరువు 10 కేజీలు మాత్రమే.
నినోకు రెగెటాన్ డాన్స్ అంటే భలే ఇష్టమట. అంతే కాదు... మెర్సిడెజ్ కారులో ప్రపంచం చుట్టి రావాలని కోరికట. జాకీ ఛాన్, సిల్విస్టర్ స్టాలోన్, కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వరో యురిబ్లను కలుసుకోవాలని కోరికట. నినో తన ఆకారాన్ని చూసి ఏరోజు బాధపడలేదట. పైపెచ్చు తనిలా ఉన్నందుకు గర్విస్తున్నాడు కూడా...! అంతే కాదు.. ఉన్నదానితో సంతృప్తి పడటంలో ఉన్న హాయి మరెందులోనూ దొరకదు కదా అని అందరికి చెప్పేస్తున్నాడు ఈ బుడతడు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన నినోకి "ఫానీ" అనే గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. ఆమె వయస్సు 18 సంవత్సరాలు, ఎత్తు ఎంతో తెల్సా... ఐదు అడుగులు, సమయం దొరికితే అప్పుడప్పుడు ఇద్దరు చిట్‌చాట్ చేస్తుంటారు. కాకాపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ రికార్డు నినో పేరు మీద ఎక్కువ కాలం వుండబోవడం లేదు. అదేంటి అంటారా..!
అవును.. ఈ సంవత్సరం అక్టోబరు 14 నాటికి నేపాల్‌కి చెందిన ఖగేంద్ర థాపా మగర్గు 18 సంవత్సరాల వయస్సు నిండనుంది. ఇతని ఎత్తు 22 అంగుళాలు మాత్రమే. మరి ప్రపంచంలో అతి పొట్టిగా ఉన్న "చిన్నోడి" గురించి తెలుసుకున్నాం మరి అలాగే అతిపొడవుగా ఉన్న "చినదాని" గురించి కూడా తెలుసుకుందామా....!
బ్రెజిల్‌కు చెందిన "ఎలిశాని సిల్వ" వయస్సు 14 ఏళ్లే కానీ ఎత్తు మాత్రం 6.9 అడుగులు (206 సెంటీ మీటర్లు). అంటే సగటు మనిషి తలెపైకెత్తి చూసేంత అన్నమాట. పాపం ఈ అమ్మడు స్కూలు బస్సులో పట్టడం లేదని స్కూలు కూడా మానేసింది. అతిగా ఎత్తున్నా కూడా కష్టమే కదా..!
అయితే.. ఇప్పటికే ప్రపంచంలో అతి పొడవైన మోడల్‌గా కాలిఫోర్నియా మోడల్ "అమెజాన్ ఈవ్" ఎత్తు 205 సెంటీ మీటర్లు ఉండగా ఒక్క సెంటీ మీటర్ ఎత్తుతో ఈ అమ్మడు ఆ అమ్మడి రికార్డు బద్దలు చేసింది (ఒక్క సెంటీ మీటర్ మీ జీవితాన్ని మార్చేస్తుంది.). మోడలింగ్ రంగంలో రాణించాలనే ఎలిశాన్ కోరికట. అయితే ఎలిశాన్ వయస్సు 14 ఏళ్లే కదా కాబట్టి ఇప్పుడే గిన్నిస్ బుక్‌లో చోటు ఇవ్వరు. ఇందుకోసం ఈ చిన్నది మరో నాలుగేళ్లు ఆగాల్సిందే.