కుప్పగూలిన సోవియట్... గోర్బచెవ్ గృహ నిర్భందం..!!

FILE
1917వ సంవత్సరంలో జరిగిన రష్యా విప్లవం, 1918-1921లో జరిగిన రష్యన్ ప్రజా యుద్ధాల తరువాత... రష్యన్ సామ్రాజ్యం నుంచి సోవియట్ యూనియన్ ఉద్భవించింది. ఇలా అనేక సోవియట్ రిపబ్లిక్‌ల సమాహారంతో ఏర్పడిన సోవియట్ యూనియన్ 1991వ సంవత్సరం, ఆగస్టు 19వ తేదీన కుప్పకూలిపోయింది. ఇదే రోజున సెలవులో ఉన్న ఆనాటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్‌ను గృహ నిర్బంధంలోకి కూడా తీసుకున్నారు.

సోవియట్ యూనియన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియాలో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991వ సంవత్సరం, ఆగస్టు 19వ తేదీన సోవియట్ యూనియన్ కుప్పకూలిన తరువాత... దీనిలోని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయి స్వతంత్ర సమాఖ్యగా ఏర్పడ్డాయి. తదనంతరం అప్పటి అధ్యక్షుడు గోర్బచెవ్ పదవినుంచి తప్పుకోవటంతో, సోవియట్ యూనియన్ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది.

ఆ సంగతలా కాసేపు పక్కనబెడితే... సోవియట్ యూనియన్ ఏర్పడిన తరువాత స్టాలిన్ యుగంలో గొప్ప ముందడుగు వేసిందని చెప్పవచ్చు. స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయాన్ని సమిష్ఠీకరించడం జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. ఈ కాలంలో ప్రైవేట్ మార్కెట్‌ను పూర్తిగా రద్దు చేశారు. అయితే, వ్యవసాయ సమిష్టీకరణను భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించి, ప్రతిఘటించినా... వారిని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చేయించటం జరిగింది.

సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్టీకరణ తరువాత గణనీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీలు రష్యన్ వ్యవసాయ క్షేత్రాలపై బాంబులు వేయటంవల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది.

స్టాలిన్ మరణానంతరం ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా క్రమంగా 40 నుంచి 20శాతానికి పడిపోయింది. అలాగే సోవియట్ యూనియన్‌కు కృశ్చేవ్, బ్రెజ్ఞేవ్ వంటి రివిజనిస్ట్ నాయకులు అధికారంలోకి వచ్చారు. వీరు రష్యాలో ప్రైవేట్ పెట్టుబడులని పునరుద్ధరించటమేగాక, పెట్టుబడిదారీ బ్యూరోక్రాటిక్ ప్రభుత్వం నడిపారు. తదనంతరం 1985 మార్చిలో మిఖాయిల్ గోర్బచెవ్ సోవియట్ కమ్యూనిష్టు పార్టీ అధినేత అయ్యాడు.

గోర్బచెవ్ అధికారంలోకి వచ్చే సమయానికి మితిమీరిన మిలటరీ వ్యయంతో సోవియట్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ క్షీణ పథంలో ఉన్నది. తూర్పు యూరప్ దేశాలలో సైనిక దళాల మోహరింపు, వర్థమాన దేశాలలో ప్రజాదరణ లేని వామ పక్ష ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందించడం, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఆయుధ పోటీలో పాల్గొనడం ఇత్యాది కారణాలన్నీ ఈ క్షీణతకు దారితీసాయి.

ఇదే సమయంలో కమ్యూనిష్టు వ్యవస్థతో అసంతృప్తి చెందిన ప్రజలు పాశ్చాత్య జీవన విధానం వైపు ఆకర్షితులయ్యారు. గోర్బచెవ్ లాంటి కమ్యూనిష్టు పార్టీ ప్రముఖులు పాశ్చాత్య జీవనశైలిని ఆయా దేశాలను సందర్శించినపుడు గమనించారు. సామాన్య ప్రజలు మీడియా ద్వారా కమ్యూనిస్టేతర దేశాల ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తెలుసుకున్నారు.

సోవియట్ యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలకు విరుగుడుగా గోర్బచెవ్ సంస్కరణలకు పూనుకున్నాడు. మొదటగా యూనియన్ రాజకేయ, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడానికి పెరిస్త్రోయికా అనే సంస్కరణను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం కమ్యూనిస్టేతర పార్టీలకు, వ్యక్తులకు చట్టబద్దతను కల్పించాడు. కొన్ని విధులతో, అధికారాలతో ఒక పార్లమెంటును ఏర్పరచాడు. వ్యక్తులు, కుటుంబాలు నిర్వహించే ప్రైవేటు వ్యాపారాలమీద నిషేధం ఎత్తివేసాడు.

కేంద్ర ప్రణాళికా వ్యవస్థలో గోర్బచెవ్ మార్పులు చేసాడు. సంస్కరణలకు మరియు అవి అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజా మద్దతు పొందటానికి గోర్బచెవ్ ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పెంచే "గ్లాస్‌నోస్త్" అనే మరో సంస్కరణను కూడా ప్రవేశపెట్టాడు. గోర్బచెవ్ అప్పటివరకు సోవియట్ యూనియన్‌కు శత్రువులుగా భావించబడిన దేశాలన్నింటితో సత్సంబంధాలకై కృషి చేశాడు.

గోర్బచెవ్ విధానాలు సోవియట్ కమ్యూనిష్టు పార్టీలోని కొందరు కరుడుగట్టిన కమ్యూనిష్టు ప్రముఖులకు నచ్చలేదు. యూనియన్‌లోని 15 రిపబ్లిక్స్‌కు ఆయన మరింత స్వాతంత్ర్యం ఇచ్చేందుకు పూనుకోవటంతో వీరు మరింతగా ఆగ్రహం చెందారు. 1991 ఆగస్టు 19వ తేదీన ఈ సాంప్రదాయ సామ్యవాద ప్రముఖులంతా కలసి గోర్బచెవ్‌కు వ్యతిరేకంగా కుట్ర చేసి అతడిని పదవి నుండి తొలగించారు. ఐతే ఈ తిరుగుబాటు విఫలమై గోర్బచెవ్ తిరిగి తన అధికారాన్ని పునరుద్దరించుకున్నాడు.

తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే గోర్బచెవ్ తన పార్టీ నాయకత్వ పదవికి రాజీనామాచేసి కేవలం ప్రభుత్వ అధినేతగానే కొనసాగాడు. కమ్యూనిష్టు పార్టీ కార్య కలాపాలన్నింటినీ స్థంభింపచేశాడు. 1991 చివరికల్లా సోవియట్ యూనియన్‌లోని రిపబ్లిక్‌లలో చాలావరకూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, డిసెంబర్‌కల్లా మొత్తం పదకొండు రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాల సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఈ పరిణామాల తరువాత గోర్బచెవ్ ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేయటంతో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలసి పోయింది.

వెబ్దునియా పై చదవండి