గడ్డిమొక్కలు నాటుతూ.. బందూకులు నాటుతున్నాననేవాడు..!!

FILE

"భగత్‌సింగ్ అంటే ఒక ఉత్సాహం

భగత్‌సింగ్ అంటే ఒక ఉత్తేజం

భగత్‌సింగ్ అంటే ఒక ఉద్వేగం"


ఉరికంబం ఎక్కుతూ, ఉరిత్రాడు మెడకు చుట్టుకున్నపుడు కూడా దేశం పట్ల అభిమానంతో, స్వాతంత్ర్య సాధనపట్ల నిబద్ధతతో "వందేమాతరం", "భారత్‌ మాతాకీ జై", "ఇంక్విలాబ్‌ జిందాబాద్" అంటూ నినాదించిన ఈ వీరుడి దేశభక్తిని తలుచుకుంటే ఆ ఒళ్ళు జలదరిస్తుంది. మనం ఈనాడు స్వేచ్చా వాయువులను పీల్చుకునేందుకు భగత్‌సింగ్‌లాంటి వీరులు చేసిన ప్రాణత్యాగం మనసుల్ని కదిలిస్తుంది.

కులం, మతం, ప్రాంతం, భాష అనే బేధం లేకుండా మొత్తం భరతఖండమంతా ప్రశంసించే గొప్ప వీరుడు, నిరుపమాన యోధుడు భగత్‌సింగ్. దేశమాత దాస్యశృంఖలాలు త్రెంచడం కోసం గుండెలెదురొడ్డి నిలబడ్డ సాహసి. స్వతంత్ర్య స్థాపన కోసం భారత ప్రజలంతా సుఖశాంతులతో, ప్రజాస్వామిక వ్యవస్థలో జీవించాలన్న ఆశయంతో.. సామ్రాజ్యవాదానికి, తెల్లదొరల పాలనకి వ్యతిరేకంగా ధ్వజమెత్తిన వీరుడు. నూనూగు మీసాల యవ్వనంలో తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన ఈ "స్వరాజ్య బాలుడి" జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో....

జాతీయోద్యమ పోరాటంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలర్పించారు. అసువులు బాసారు. అయితే వాళ్ళందరిలోనూ భగత్‌సింగ్ అమరవీరుడుగా భారత ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి కారణం… ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, మహావిప్లవ శక్తి. మూడేళ్ళ వయసులోనే "గడ్డిమొక్కల్ని నాటుతూ బందూకుల్ని నాటుతున్నాననే వాడు… బ్రిటిషు ప్రభుత్వంతో పోరాటం చేస్తానంటూ జబ్బలు" చరిచిన ధీశాలి.
చాలామందిని కనలేకపోయానే...!
కన్నకొడుకు శవాన్ని కూడా చూసుకోలేకపోయిన భగత్‌సింగ్‌ తల్లి.. "స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకునే యిటువంటి వారిని ఇంకొంతమందిని కనలేకపోయా"నని దు:ఖించిందట. ఈ విషయం విన్న ఎవరికైనా "ఇటువంటి తల్లులను కన్నదికదా నా భారతదేశం" అని గుండెలు గర్వంతో ఉప్పొంగక మానవు.


బాల్యం నుండే భగత్‌సింగ్ హృదయంలో స్వతంత్రేచ్ఛ నాటుకు పోయింది. తాత అర్జున్‌సింగ్ అతడికి దేశం పట్ల ప్రేమనీ, స్వతంత్రభావాల్నీ, అన్నిటికీ మించి నిజాయితీని నూరిపోసేవాడు. ఇక సింగ్ తండ్రి కిషన్‌సింగ్, ఆయన సోదరులు ఇద్దరూ జాతీయోద్యమ పోరాటంలో పనిచేసినవారే. పినతండ్రులిద్దరూ జెయిల్లో వున్న సమయంలో పినతల్లుల్ని ఓదార్చేవాడు భగత్‌. దేశంకోసం వాళ్ళు చేస్తోన్న పోరాటాన్నీ, త్యాగాలనీ వివరించి ధైర్యాన్నిచ్చేవాడు.

భగత్ సింగ్ బాల్యాన్ని తరచి చూస్తే... అవిభాజ్య భారతావనిలోని బంగా గ్రామం (ప్రస్తుతం ఇది పాకిస్థాన్‌లోని లైలాపూర్ జిల్లాలో ఉంది)లో 1097వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తిచేసిన ఆయన, ఉన్నత చదువుల కోసం లాహోర్ చేరారు. అక్కడ "పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్", "భాయ్ ప్రేమానంద్" లాంటి అగ్రశ్రేణి స్వాతంత్ర్య సమరయోధులు బోధన చేస్తున్న "నేషనల్ కాలేజీ"లో విద్యనభ్యసించారు.

ఈ క్రమంలోనే విప్లవకారుడిగా తీర్చిదిద్దబడిన భగత్‌సింగ్‌తో పాటు అనేక మంది విద్యార్థులు "కాలేజీ"ని వదిలి.. గాంధీజీ పిలుపుకు ప్రభావితులై స్వాతంత్ర్య ఉద్యమంలో ఉరికారు. తనకు పెళ్ళి చేయాలని భావిస్తున్న తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదని సింగ్ ఢిల్లీ చేరుకున్నారు. "దైనిక్‌ అర్జున్" , "ప్రతాప్" వంటి పత్రికల్లో కొంతకాలం పనిచేసిన ఆయనకు, ఆ సమయంలోనే గణేష్‌ విద్యార్థి, బటుకేశ్వరదత్‌ వంటి విప్లవకారుల సహచర్యం లభించింది. విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించగలదని భావించిన భగత్‌సింగ్‌ 1924లో "నౌ జవాన్‌ భారత్‌ సభ" స్థాపించారు.

ఆ తరువాత భగత్‌సింగ్‌కు సుఖదేవ్‌, భగవతీచరణ్‌లు పరిచయమయ్యారు. అదే సమయంలో కాన్పూర్‌లో వరదలు రావడంతో, సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న భగత్‌సింగ్‌కు చంద్రశేఖర ఆజాద్‌ వంటి విప్లవవీరుడు పరిచయం కావడం... తరువాతి కాలంలో వారు ప్రాణస్నేహితులుగా మారి, "హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ"ని స్థాపించడం జరిగింది. "పంజాబ్‌ కేసరి" లాలా లజపతిరాయ్‌ మృతికి కారణమైన పోలీసు అధికారి సాండర్స్‌ను ఆజాద్‌, భగత్‌సింగ్‌, రాజగురు సుఖదేవ్‌లు హతమార్చారు.

FILE
1929వ సంవత్సరంలో ఢిల్లీ అసెంబ్లీలో "పబ్లిక్‌ సేప్టీ బిల్"' ప్రవేశ పెట్టే సమయంలో భగత్‌సింగ్‌, బటుకేశ్వరదత్తాలు బాంబు వేశారు. ఆ సమయంలో తప్పించుకుపోయే అవకాశం వున్నప్పటీకీ, వారందరూ పోలీసులకు లొంగిపోయారు. చంద్రశేఖర ఆజాద్‌, భగత్‌సింగ్‌ తదితరులను జైలు నుంచి తప్పించడానికి ప్రయత్నించినప్పటికీ.. భగత్‌సింగ్‌ అందుకు నిరాకరించారు.

భగత్‌సింగ్‌ తదితరులపై వివిధ అభియోగాలు మోపబడ్డాయి, ప్రధానంగా, "ఢిల్లీ అసెంబ్లీలో బాబు సంఘటన" వంటి అభియోగాల ఆధారంగా భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురులకు మరణశిక్ష (ఉరి) విధించబడింది. జైలులో సరైన సదుపాయాలు లేకపోవడంతో, అందుకోసం భగత్‌సింగ్‌ తదితరుల నిరాహారదీక్ష ప్రారంభించారు. భగత్‌సింగ్‌ 115 రోజులు నిరాహారదీక్ష (దీక్ష 63 వ రోజున యతీత్రదాస్‌ మరణించారు) ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి, జైలులో సరైన కనీస సదుపాయాలు కల్పించింది.

31 మార్చి 1931న భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురులు భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనా యజ్ఞంలో సమిధలుగా "ఇంక్విలాబ్‌ జిందాబాద్", "వందేమాతరం", "భారత్‌మాతాకీ జై" అని నినదిస్తూ ఉరికంబం ఎక్కి, ప్రాణత్యాగం చేశారు. కన్నకొడుకు శవాన్ని కూడా చూసుకోలేకపోయిన భగత్‌సింగ్‌ తల్లి.. "స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకునే యిటువంటి వారిని ఇంకొంతమందిని కనలేకపోయా"నని దు:ఖించిందట. ఈ విషయం విన్న ఎవరికైనా "ఇటువంటి తల్లులను కన్నదికదా నా భారతదేశం" అని గుండెలు గర్వంతో ఉప్పొంగక మానవు.

"నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం" అంటూ... అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు, భగత్‌సింగ్ రాసిన లేఖలో మాదిరిగానే భారతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు ఆయన తన సహచరులతో కలిసి బలిదానం అయ్యాడు.

ఇక చివరిగా... ఒక ఆవేశపూరిత యువ విప్లవకారుడిగా, ఒక ఆరాధ్య ప్రతిమగా, ఓ చిహ్నంగా మాత్రమే భగత్‌సింగ్‌ను అందరూ గుర్తించాలని పాలకులు, ప్రభుత్వాలు ఆశిస్తూ వచ్చాయి. దాదాపుగా నేటికీ అలాగే జరుగుతూ వస్తోంది. అయితే భగత్‌సింగ్ గాంధీ మార్గానికి భిన్నంగా వెళ్లిన ఓ విప్లవకారుడు మాత్రమే కాదు.. అతను ఆలోచనాపరుడు, మేధావి, సిద్ధాంత నిబద్ధతకు స్వచ్చమైన ప్రతీక.

తాను చేస్తున్నది యుద్ధం అన్న స్పృహ కలిగిన రాజకీయవాది. ఆయన త్యాగాన్ని సాహసానికి ప్రతీకగా గుర్తిస్తే నష్టపోయేది జాతే. ఆయన పుట్టిన ఊర్లో ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తేనో.. నాలుగు చోట్లు విగ్రహాలు స్థాపిస్తేనో భగత్‌సింగ్ వారసత్వం ప్రజలకు అందినట్లు కాదు.

విలాసవంతమైన వృత్తి, ఉద్యోగావకాశాలే పరమావధిగా.. పైపైకి ఎదగటమే సిద్ధాంతంగా. పరాయి వినోదాల మత్తులో జోగటమే సంస్కృతిగా మారిపోతున్న యువతరానికి భగత్‌సింగ్ స్ఫూర్తిని అందించేందుకు ప్రభుత్వాలు, ప్రజాసంస్థలు, ప్రజా ఉద్యమాలు మరింత ప్రయత్నం చేయాలి. లౌక్యం, ఆచరణాత్మకత, స్వార్థం తప్ప ఆదర్శం అనే మాటే ఎరుగని నేటి తరానికి భగత్‌సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మార్గ నిర్దేశకత్వం చేయాలి.

"చిరునవ్వులతో ఉరికంబాలెక్కిన విప్లవకారులందరినీ సదా అందరం దృష్టిలో వుంచుకోవాలి. వారేమీ ఆకాశాన్నుంచి ఊడిపడిన అసాధారణ శక్తులు గల మనుష్యులు కాదనీ… మనందరిలాంటి సాధారణ మానవమాత్రులేనని అర్థం చేసుకుని… వారి జీవిత చరిత్రలను చదివి ఉత్తేజితులై…” భరతమాత కీర్తిని నలుదిశలా వ్యాపించేందుకు కృషి చేయాలి.

వెబ్దునియా పై చదవండి