చిన్నూకు పళ్లు తోమటం అంటేనే చిరాకు. పళ్లు తోముకోకుండా తప్పించుకునేందుకు ఇల్లంతా పరుగులు తీస్తుంటాడు. అయినా అమ్మ ఎంత చెప్పినా వినకుండా పళ్లు తోముకునేలా చేస్తోంది. ఒకరోజు తను పళ్లు తోముకోకుండా తప్పించుకునేందు బలమైన సాకు ఒకటి దొరికింది. వెంటనే అమ్మను లాక్కెళ్లి పెరట్లోని ఆవుదూడను చూపించాడు. అది కూడా నాలా చిన్నదే కదా..? అది మాత్రం పళ్లు తోముకోవటం లేదు. మరి నేనేందుకు తోముకోవాలి..? అంటూ తల్లిని ఎదురు ప్రశ్నించాడు.
అబ్బో తన కొడుకుకు ఎంత తెలివో అనుకుంటూ మురిసిపోయిన ఆ తల్లి.. జంతువులు పళ్లు తోమకపోయినా ఫర్వాలేదు నాన్నా. మనం మనుషులం. తప్పకుండా పళ్లు తోముకోవాలి అంటూ నచ్చజెప్పింది. నువ్వు పళ్లు తోముకోకుండా స్కూలుకెళితే నీ ఫ్రెండ్స్‌తో దగ్గరగా కూర్చుని మాట్లాడేటప్పుడు, ఆడుకునేటప్పుడు దుర్వాసన వస్తుంది. దాంతో వాళ్లు నీకు దూరంగా వెళతారు. అప్పుడు నువ్వు బాధపడతావు. అంతేకాకుండా పళ్లనిండా క్రిములు చేరి పంటినొప్పి తెస్తాయని చెప్పింది తల్లి.
పళ్లు తోమకుండా ఉంటే.. వాటిమధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలవల్ల సూక్ష్మక్రిములు ప్రవేశించి నోరు దుర్వాసన రావటమే కాకుండా, పళ్లు పాడవుతాయి. దంతక్షయం ఏర్పడుతుంది. దీంతో పళ్లు ఊడిపోయి కొన్నిరోజులకే అమ్మమ్మ, తాతయ్యల నోరులాగా అయిపోతుంది. దీంతో నీ ఫ్రెండ్స్ అంతా నిన్ను ఆటపట్టిస్తారని చెప్పింది తల్లి.
అదిసరే అమ్మా.. మరి జంతువులు మాత్రం పళ్లు తోముకోవు ఎందుకని..? మరి వాటినోరు దుర్వాసన రాదా..? పళ్లు ఊడిపోవా..? మళ్లీ ప్రశ్నించాడు చిన్నూ. జంతువులకు అలాంటి సమస్యలు రావు చిన్నూ. ఎందుకంటే మనుషుల్లాగా రకరకాల ఆహారాన్ని తినే అలవాటు జంతువులకు లేదు. పీచు బాగా ఉండే ఆకులు, గడ్డిని మాత్రమే అవి తింటాయి.
అదే విధంగా జంతువుల పళ్లు దగ్గదగ్గరగా, పెద్దవిగా ఉంటాయి. వాటి నాలుకలు పొడవుగా, గరుకుగా ఉంటాయి. నాలుకలతో పళ్లను పదే పదే నాకుతూ అవి శుభ్రం చేసుకుంటాయి. అదే విధంగా జంతువుల లాలాజలం (ఎంగిలి)లోని లవణీయత, జిహ్వస్రావాల లాంటివల్ల దంతక్షయం రాకుండా ఉంటుంది. కాబట్టి జంతువులు పళ్లు తోమకపోయినా ఫర్వాలేదు.
ఇప్పుడైనా అర్థమైందా చిన్నూ..? అడిగింది తల్లి. ఓ బాగా అర్థమైందమ్మా.. ఇకపై ప్రతిరోజూ పళ్లు తోముకుంటాను.. నిన్ను ఏడిపించనులే..!! అంటూ బ్రష్ పట్టుకుని స్నానాల గదిలోకి దూరాడు చిన్నూ.