డీప్‌ ఫ్రీజర్‌లో కూల్‌డ్రింక్ సీసాలు పెట్టకూడదా...?

FILE
సాధారణంగా ఏవైనా ద్రవ పదార్థాలు త్వరగా చల్లబడేందుకు రిఫ్రిజిరేటర్‌ (ఫ్రిజ్)లోని డీప్ ఫ్రీజర్‌లో పెడుతుంటటం మామూలే. అయితే కూలింగ్ తగ్గిపోయిన కూల్‌డ్రింక్ సీసాలను కూడా అలాగే డీప్ ఫ్రిజర్‌లో మూత తీయకుండా పెట్టవచ్చా..? అలా పెడితే ఏమవుతుందో మీకెవరికయినా తెలుసా పిల్లలూ..?

డీప్ ఫ్రీజర్‌లో కూల్‌డ్రింక్ సీసాలను మూత తీయకుండా పెట్టినట్లయితే.. అవి పగిలిపోతాయి. కాబట్టి డీప్ ఫ్రీజర్‌లో వాటిని పెట్టకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే.. ఘన, ద్రవ పదార్థాలను వేడి చేసినప్పుడు వ్యాకోచం చెంది, బాగా చల్లబరిచినప్పుడు సంకోచిస్తుంటాయి.

సాధారణ నీరు కూడా నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్దాకా చల్లబరిస్తే.. సంకోచం చెందుతుంది. ఈ ఉష్ణోగ్రతవద్ద దాని సాంద్రత అత్యధికంగానూ.. పరిమాణం అత్యల్పంగానూ ఉంటుంది. దానిని మరింతగా చల్లబరిచినప్పుడు పరిస్థితి మారిపోతుంది. బాగా వేడి చేసినప్పటిలాగే దాని పరిమాణం పెరుగుతుంది, సాంద్రత తగ్గుతుంది.

అదే నీరు ఘనీభవించే స్థితికి వచ్చేసరికి... అంటే సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద దాని పరిమాణం అధికంగా ఉంటుంది. ఫలితంగా కూల్‌డ్రింక్ సీసాపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దాంతో సీసా పగిలిపోతుంది. కాబట్టి పిల్లలూ.. కూల్‌డ్రింక్ సీసాలను ఎప్పుడుకూడా డీప్ ఫ్రీజర్‌లో ఉంచకూడదు. కావాలంటే వాటిని డీప్ ఫ్రీజర్‌లో కాకుండా, మామూలుగా ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి