"యమహానగరి.. కలకత్తాపురి.."కి 320 ఏళ్లు...!

FILE
బ్రిటీష్‌వారి గుండెల్లో మరఫిరంగిలా గుచ్చుకున్న "వందేమాతరం" తొలిసారిగా మారుమ్రోగింది ఇక్కడే. మానవాళిని జాగృతం చేసిన "గీతాంజలి"ని రచించి తద్వారా దేశానికి జాతీయ గీతాన్ని అందించిన "విశ్వకవి" రవీంద్రుడు ఇక్కడివాడే. మానవసేవకు మారుపేరుగా నిలచిన విశ్వమాత మదర్‌ థెరీసాను అక్కున చేర్చుకున్నదీ ఈ మహానగరమే.. అదే "కలకత్తా"

నేడు "కోల్‌కతా"గా పిలవబడుతున్న నాటి ఈ మహానగరానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. క్రీ.శ. 17వ శతాబ్దంలో "ఈస్టిండియా కంపెనీ" బ్రిటీష్ సామ్రాజ్యానికి వేదికగా మారిన ఈ నగరం.. ఎన్నో స్వాతంత్ర్య సంగ్రామాలకు వేదికగా మారింది. 1960 ఆగస్టు 24వ తేదీన బ్రిటీష్‌ వ్యాపారవేత్త జాబ్‌ చర్నోక్‌ స్థాపించిన "కలకత్తా" మహానగరానికి నేటికి సరిగ్గా 320 యేళ్లు. ఈ సందర్భంగా...

బ్రిటీష్‌ ఇండియా రాజధానిగా వెలుగొందిన మహానగరం కలకత్తా. ఆంగ్లేయులు 17వ శతాబ్దం చివరిలో ‘ఈస్టిండియా కంపెనీ’ పేరుతో భారత్‌లో అడుగుపెట్టినప్పుడు, తొలిసారి వారి కన్ను కలకత్తాపై పడింది. తమ వ్యాపార విస్తరణకు ఎంతో అనువైన ప్రదేశంగా భావించి ఇక్కడినుండే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు.
నేతాజీ, వివేకానందుల పురిటిగడ్డ..!
స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులను జాగృతం చేసిన మహోన్నత రచయితల పురిటిగడ్డ ఇది. భారతీయ శౌర్య పతాకను విశ్వవినువీధుల్లో ఎగురవేసిన స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలు కలకత్తా వాసులే. "అజాద్‌ హింద్‌ ఫౌజ్"ను స్థాపించి తెల్లవాడిని గడగడలాడించిన నేతాజీ జన్మ...


1690లో బ్రిటీష్‌ వ్యాపారవేత్త జాబ్‌ చెర్నోక్‌ కలకత్తా నగరాన్ని అభివృద్ధి చేశాడని చెబుతారు. బ్రిటీష్‌వారు, వారి వ్యాపారకేంద్రాన్ని సంరక్షించుకునేందుకు 1696లో "విలియం ఫోర్ట్" నిర్మించుకొని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అయితే, బెంగాల్‌ను పాలించిన సిరాజ్‌-ఉద్‌-దౌలా 43మంది బ్రిటీష్‌వారిని అంతమొందించి ఈ ఫోర్ట్‌ను ధ్వంసం చేశాడు.

ఆ తరువాత 1757లో బ్రిటీష్‌ వైస్రాయ్‌ రాబర్ట్‌ క్లైవ్‌ విలియం ఫోర్ట్‌ను మళ్ళీ నిర్మించాడు. ఇక్కడ ఆంగ్లేయులు సరుకుల రవాణా నిమిత్తం హుగ్లీనదిపై రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1850లో రైలుమార్గాలు, రోడ్డు మార్గాలను కూడా అభివృద్ధి చేశారు. అలా.. 19వ శతాబ్దకాలంలో కలకత్తా బ్రిటీష్‌ ఇండియాలో అతిపెద్ద నగరంగా అవతరించింది.

బెంగాలీలు మొదటినుంచీ కలకత్తా నగరాన్ని "కోల్‌కతా"గానే పిలిచేవారు. కాళికత, సుతానుతి, గోవిందపురం అనే మూడు గ్రామాల కలయికే నేటి కోల్‌కతా నగరం. కాళికత పేరు రాన్రూనూ కోల్‌కతాగా మారగా.. అది కాస్తా బ్రిటీష్ వారి రాకతో "కలకత్తా"గా మారిపోయింది. ఈ ప్రాంతాన్నే బెంగాళీలు "కాళిక్షేత్ర" అని కూడా సంభోదిస్తుంటారు. కాళిక్షేత్ర అంటే కాళీమాత కొలువైన ప్రదేశం అని అర్థం.

కలకత్తా మహానగర విశేషాలను చూస్తే... మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది "హౌరా బ్రిడ్జి". ఇది ఈ నగరానికే తలమానికంగా నిలవటమేగాక... ప్రపంచంలోనే ఎక్కువమందిచే వాడబడుతున్న బ్రిడ్జీగా రికార్డు సృష్టించింది. ఈ బ్రిడ్జీని రెండో ప్రపంచయుద్ధ కాలంలో కోల్‌కతా-హౌరా నగరాలను కలుపుతూ హుగ్లీ నదిపై 1943వ సంవత్సరంలో నిర్మించారు. 1965లో ఈ వంతెనకు విశ్వకవి రవీంద్రుని పేరు పెట్టారు. అప్పటినుండి ఈ వంతెనను "రవీంద్ర సేతు" అని పిలుస్తారు.

సర్‌ బ్రాడ్‌ఫోర్డ్‌ లెస్లీ అనే బ్రిటీష్‌ అధికారి 1874లో హుగ్లీ నదిపై ఒక వంతెనను నిర్మించాడు. పూర్తిగా చెక్కను ఉపయోగించి నిర్మించిన ఈ బ్రిడ్జి ఎక్కువ బరువును మోయలేకపోవడంతో 1933లో బెంగాల్‌ ప్రభుత్వం దీని స్థానంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని రూపొందించింది. ఆ తరువాత 1943లో ఇప్పుటి మోడ్రన్‌ "హౌరా బ్రిడ్జి" రూపుదిద్దుకుంది.

దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరుగాంచిన కలకత్తాలో.. మరే ఇతర నగారాల్లో లేని అద్భుతమైన రవాణా సౌకర్యమైన "ట్రామ్స్" వ్యవస్థ ఉంది. అచ్చం బస్సులను పోలి ఉండే ఈ రైళ్ళు ప్రతిరోజు కొన్ని లక్షలమందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఈ రవాణా వ్యవస్థ బ్రిటీష్‌వారి కాలంలోనే రూపుదిద్దుకుంది. 1880లో ‘కలకత్తా ట్రామ్‌వే’ కంపెనీని ఏర్పాటు చేశారు.

మీటర్‌గేజ్‌ ట్రాక్‌ను పోలిఉండే ఈ రైల్వే ట్రాక్‌పై మొదట్లో ట్రామ్‌లను లాగేందుకు గుర్రపుబగ్గీలను ఉపయోగించేవారు. ఆ తరువాత వీటి స్థానంలో ఇంజిన్‌లు వచ్చాయి. రైల్వే వ్యవస్థ ప్రారంభమవడంతో నేడు మనం చూస్తున్న ట్రామ్‌లు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలో ఈ వ్యవస్థ కేవలం కోల్‌కతాలోనే ఉండటం గమనార్హం. ముంబాయి, చెన్నై, హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఎంఎంటీఎస్‌ వ్యవస్థ ఉన్నా, ట్రామ్స్‌ రవాణా వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.

కలకత్తా మహానగరం ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, శాస్తవ్రేత్తలు ఈ గడ్డపై జన్మించారు. రవి అస్తమించిని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఎన్నో ఉద్యమాలకు సైతం కలకత్తా వేదికగా మారింది. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులను జాగృతం చేసిన మహోన్నత రచయితల పురిటిగడ్డ ఇది. భారతీయ శౌర్య పతాకను విశ్వవినువీధుల్లో ఎగురవేసిన స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలు కలకత్తా వాసులే.

"అజాద్‌ హింద్‌ ఫౌజ్"ను స్థాపించి తెల్లవాడిని గడగడలాడించిన నేతాజీ జన్మస్థలం కూడా ఇదే. కేవలం స్వాతంత్య్ర సమరయోధులు, కవులేకాదు, శాస్తవ్రేత్తలకు, కళాకారులకు కూడా పుట్టినిల్లు కలకత్తా మహానగరం. ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త జగదీష్‌ చంద్రబోస్‌ లాంటి సైంటిస్టులకు, అమర్త్యసేన్‌ వంటి ఆర్థికవేత్తలకు జన్మస్థానం. భారతీయ చలనచిత్ర రంగానికి వన్నెతెచ్చిన సత్యజిత్‌ రే కూడా ఇక్కడివాడే...!

వెబ్దునియా పై చదవండి