మనదేశంలో ఇప్పటికీ గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య ఇప్పటుకీ ఎక్కువగానే ఉంది. 2020వ సంవత్సరం నాటికి దేశంలోని యాభై శాతం మంది గుండె జబ్బులకు ప్రధాన కారణమైన మధుమేహం బారిన పడతారని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు వచ్చాక చికిత్స చేయించుకోవడం కన్నా, రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలంటున్నారు వైద్య నిపుణులు.
మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు, ధూమపానం, వంశపారంరపర్యం, కొరవడిన వ్యాయామం, ఒత్తిడితో కూడిన జీవనం... ఇలా పలుకారణాలతో హృద్రోగాలు వస్తున్నాయి. కారణాలేమైనా గుండె జబ్బులతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, దీన్ని అమలులో ఉంచాలంటే ముందు జాగ్రత్త మేలు.
గుండె సంబంధ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం శరీరంలో అథిరోస్ల్కిరోసిన్ సమస్య పెరగడం, అథిరోస్ల్కిరోసిన్‌లో శరీరంలోని రక్తనాళాల లోపలి పొర మందంగా పెరుగుతుంది. దీని ద్వారానే భవిష్యతులో రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇరవై, ముప్పై సంవత్సరాల వయసులోనే అథిరో స్ల్కిరోసిన్ వ్యాధి ఆరంభమవుతుంది. గుండె జబ్బులు రాక ముందు దానికి కారణమైన అథిరోస్ల్కిరోసిన్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే భవిష్యతులో హృద్రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
* కెరోటిడ్ మీడియల్ ఇంటీరియల్ థిక్‌నెస్ పరీక్షః ఈ విధానంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గొంతు వద్ద ఉన్న కెరోటిడ్ రక్తనాళం లోపలిపొర మందం పెరిగిందా? అన్నే అంశాని నిర్థారించ వచ్చు. రక్తనాళం లోపలి పొరథిక్‌నెస్ పెరిగితే, ఆ రోగికి ఆథిరో స్ల్కిరోసిన్ వ్యాధి ఉన్నట్లు. ఈ వ్యాధి ఉన్న రోగికి భవిష్యతులో గుండెజబ్బు వచ్చే అవకాశముంది. కాబట్టి రోగి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హృద్రోగం రాకుండా చూసుకోవచ్చు.
* యాంకిల్ బ్రెకెల్ ఇండెక్స్ పరీక్షః అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చేతికి ఉన్న రక్తనాళం లోపలి పొరలో ఉన్న థిక్‌నెస్ కనుక్కోవచ్చు. రక్తనాళం లోపలి పొర మందంగా కనిపిస్తే సదరు రోగికి గుండెజబ్బులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
* కాల్షియం స్కోరింగ్: ఇది గుండెలోని రక్తనాళాల్లో కాల్షియం స్కోరు ఎంత ఉందనే పరీక్ష. రక్తనాళంలో కాల్షియం స్కోరు పెరిగితే భవిష్యత్తులో హృద్రోగం వచ్చే అవకాశమున్నట్లు ముందుగానే గుర్తించి జాగ్తత్తలు తీసుకోవడం మంచిది.
* ముందు జాగ్రత్తలు ముఖ్యం: హృద్రోగాలకు కారణాలను నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌గా విభజించవచ్చు. హృద్రోగాలు ఉన్న కుటుంబంలో జన్మించడం, నలభై ఏళ్ల వయసు దాటాకా, మహిళల కంటే పురుషుల్లో గుండె జబ్బులు వస్తున్నాయి. ఈ కారణాలు నివారించలేనివి. గుండె జబ్బులు రాకుండా నివారించదగిన వాటిని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు.
ధూమపానం, కొవ్వు అధికంగా పేరుకుపోవడానికి కారణమైన మటన్, బీఫ్‌లను తినకుండా ఉండటం వల్ల నివారించవచ్చు. కూర్చుని పనిచేసే వారు మధ్యలో రెండు గంటలకు ఓ సారి లేచి వాకింగ్ చేయడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరి. మధుమేహం, హై బీపీ, హైకొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్న వారిలో ఎక్కువ గుండె వ్యాధులు వస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది.
ప్రత్యేకంగా మధ్య తరగతి మహిళల్లో, పిరియడ్స్ ఆగిపోయి, ఇంటిపట్టున నీడన వారిలో విటమిన్ డి లోపం ప్రధానంగా కనిపిస్తుంది. అందువల్ల మహిళలు ప్రతిరోజు ఉదయాన్నే ఏడు-ఎనిమిది గంటల మధ్య వాకింగ్ చేయడం, సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోవడం, విటమిన్ డి టాబ్లెట్లు వాడటం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.