గురక వస్తుందంటే ముక్కు రంధ్రం(నాసికా రంధ్రం)లోనో లేదా మెడలోని వెనుక భాగంలోనో అదనంగా కొంత కణజాలం పెరిగిందనడానికి నిదర్శనం. కొందరిలో గొంతుకు సంబంధించిన కణజాలం బిగువు సడలడం (గట్టితనం కోల్పోవడం) వల్ల కూడా గురక వస్తుంది. మరికొందరిలో నాలుక మడతపడి శ్వాసకు అడ్డుపడటం వల్ల కూడా గురక రావొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, గురక ఏ కారణంగా వస్తోందో ఒకసారి స్పష్టంగా గుర్తిస్తే, ఆ సమస్యను తొలగించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా, రాత్రివేళ మద్యం సేవించడం, నిద్రా భంగిమను అపసవ్యంగా మార్చివేయడం, గురకకు దారి తీసే కొన్ని మందులను దీర్ఘకాలికంగా వాడటం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడానికి దారితీసే వాతావరణంలో ఎక్కువ సమయం ఉండటం వంటివి కూడా గురక సమస్యకు మూలమవుతాయి. ఆ కారణాల్ని గుర్తించి వాటికి దూరమైతే గురక సమస్య నుంచి విముక్తిం పొందడం సులువవుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.