చాలా మంది కునుకు తీస్తేచాలు పెద్ద శబ్దంతో గురకపెడుతుంటారు. సామాన్యంగా కనిపించే ఈ గురకతో చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గురక లావు పెరగడానికే కాకుండా, ఇతర గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా.. గురకపెట్టేవారు వెల్లికిలా పడుకుని సగం నోరు తెరుచుకుని ఉంటారు. శ్వాస కూడా సగం ముక్కు ద్వారా, సగం నోటి ద్వారా పీల్చుతుంటారు. గురక పెట్టడానికి లింగభేదం, వయోభేదం లేకపోయినప్పటికీ ఎక్కువగా మగవారిలోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది.
ఏ కారణం చేతనైనా నాసికా రంధ్రాలు మూసుకుపోయినప్పుడు పెద్దగా శ్వాస తీసుకుంటారు. అపుడు గొంతులో ఉండే ఫారింక్స్ లేదా సాఫ్ట్ పాలెంట్ కణజాలం కదలికల వలన పలు రకాల స్థాయిలలో గురక వస్తుంది. సిగరెట్లు, మద్యం మొదలైన అలవాట్లు ఉన్న వారికి కూడా గురక వస్తుంది.
వాతావరణ మార్పులు తరచుగా వచ్చే దగ్గు, జలుబు సైనుసైటిస్ మొదలైన వాటి వలన కూడా నాసికా రంధ్రాల్లో అవరోధం ఏర్పడి గురక వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో గురక వల్ల గుండెకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే, గురక ఉన్న వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దీని నుంచి విముక్తి పొందవచ్చు. గొంతునొప్పి లేదా దురద ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అదేసమయంలో సిగరెట్లు, మద్యం సేవించడం మానేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.