తాజా పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు. ఇక ఇంట్లో తాజా పండ్ల రసాలను సిద్ధం చేసుకోవడం కుదరక షాపుల్లో పండ్ల రసాలను ఎంచక్కా తాగేస్తుంటాం. అయితే పండ్ల రసాలను ఇంట్లోనే సిద్ధం చేసుకోవడం మంచిదని.. ఫ్రూట్ జ్యూస్‌లకంటే పండ్లను అలాగే తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రూట్ షాపుల్లో ఉపయోగించే పండ్లు తాజాగా ఉన్నాయా? కుళ్లిపోయినవా? అనే విషయం మనకు తెలియదు.
అంతకంటే జ్యూస్‌ల కోసం షాపుల్లో ఉపయోగించే నీరు శుభ్రంగా ఉందా? లేదా? వారు వాడే ఐస్ ఎలాంటిది అనే దానిపై దృష్టి పెట్టలేం కాబట్టి.. ఇంట్లోనే పండ్ల రసాలను సిద్ధం చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐస్ కోసం వాడే నీటితో చాలా డేంజరని.. వాటి ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. అందుకే బయట షాపుల్లో ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపించినా విత్ అవుట్ ఐస్ తీసుకోవడం మంచిది.
అందుకే ఇలాంటి జ్యూస్‌లు తాగేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, కుళ్లిన పండ్లపై అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటున్నాయని, కుళ్లిన పండ్లతో తయారు చేసిన జ్యూస్ క్యాన్సర్, జాండిస్, అతిసార లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు గురిచేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా కొలై, షెగెల్లా, సైఫర్‌కోకస్ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు కాదు పండ్లను తాజాగా ఉంచడం కోసం ఇంజక్షన్లను ఉపయోగించడం, సువాసనలకోసం రకరకాల రసాయనాలను వాడడటం, బోరునీళ్లతో ఐస్ తయారు చేయడం, కుళ్లినపండ్లపై దుమ్మూ, ధూళి చేరడం, అపరిశుభ్రమైన చేతులను జ్యూస్‌తయారీకి వాడడం మొదలైనవన్నీ కలిసి రసాయన చర్య జరిగి జ్యూస్ తాగేవారిపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పండ్లను తాజాగా కొనుగోలు చేసి వాటిని ఇంట్లోనే పండ్ల రసంగానూ లేక అలాగే తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూర్చిన వారవుతారని వైద్యులు సలహా ఇస్తున్నారు.