ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో బంధాల మీద, బంధుత్వాల మీద ప్రేమ అనేది కరువైపోతుంది. మనకు నచ్చిన వారిని, మన ఆత్మీయులని ప్రేమతో పలకరించడమే కాదు. అప్పుడప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం చేస్తుండాలట. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇంత కన్నా మంచి మార్గం లేదు. ఇది నిజం. కౌగిలింత ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ కౌగిలింత వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
అమ్మానాన్నాల ప్రేమని, ప్రేయసిప్రియుల పరవశాన్ని, అక్కాచెల్లెళ్ల, అన్నదమ్ముల అనురాగాన్ని, స్నేహితుల బాంధవ్యాన్ని, క్రీడాకారుల విజయోత్సాహాన్ని... ఒకటనేమిటి అన్ని రకాల భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తం చేయగలిగే చక్కని పలకరింపే కౌగిలింత.
1. నవ్వులానే అనేక వ్యాధుల నివారణకు బిగి కౌగిలి అద్భుత చికిత్స. నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒత్తిడి, డిప్రెషన్, భయాందోళనలను తగ్గిస్తుంది. చిన్నిపిల్లల్ని కుటుంబ సభ్యులంతా ఎత్తుకుని హత్తుకునే ఆ స్పర్శలోని వెచ్చదనం పెద్దయ్యేవరకు కూడా నరాల్లో అంతర్లీనంగా దాగే ఉంటుంది. కౌగిలింతలకు నోచుకోని పిల్లల్లో ఐక్యూ మందగిస్తుందనీ, ఫలితంగా నడవడం, మాట్లాడటం, చదవడం..... ఆలస్యమవుతాయన్నది ఓ అధ్యయనంలో తేలింది.