బరువు తగ్గడం కోసం మధ్యాహ్న భోజనాన్ని మానేస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి. దీనితో ప్రయోజనం శూన్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో పడి.. మధ్యాహ్న భోజనం మానేస్తే... శరీరానికి అలసట తప్పదు. మధ్యాహ్న భోజనాన్ని మానేస్తే.. అసిడిటీ వంటి సమస్యలు తప్పవు. ఎందుకంటే భోజనం తర్వాత దాదాపు రెండు గంటల వరకూ కూడా మనలో జీవక్రియలు వేగవంతమవుతాయి.
భోజనం మానేస్తే ఇవి మందగిస్తాయి. మధ్యాహ్న భోజనాన్ని మానేస్తే సాయంత్రానికి స్నాక్స్ తెగ లాగిస్తారు. దీంతో క్యాలరీల మోతాదూ పెరిగిపోతుంది. ఆఫీసుల్లో సాయంత్రం టీ సమయంలో సమోసాలు, పకోడీల వంటి నూనెలతో నిండిన రకరకాల పదార్థాలను ఎక్కువ తింటే.. బరువు పెరగడం ఖాయం. మధ్యాహ్నం పూట ఆహారం తీసుకోని వారు రాత్రి పూట మరీ ఎక్కువ భోజనాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మధ్యాహ్నం తీసుకునే ఆహారాన్ని పక్కనబెట్టకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.