కార్తీకమాసంలో పితృదేవతలకు నువ్వులు విడవాలి. అలా ఎన్ని నువ్వులు విడువబడుతాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టదాయకం.
సరస్వతి - ఉసిరి రూపము, లక్ష్మీ - మాలతి రూపము, గౌరి - తులసిరూపంగా వెలసినట్లు పురాణాలు చెప్తున్నాయి. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి.
కార్తీకమాసం ద్వాదశి రోజున 'తులసి' వృక్షసన్నిధిలో దీపప్రజ్వలనం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణలు చేస్తే, అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయని విశ్వాసం.