పిల్లల్లో డిప్రెషన్‌కు కారణాలేంటి?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (12:10 IST)
డిప్రెషన్‌ అంటే.. ఇదో మానసిక సమస్య. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో బాధపడటం, ఒంటరిగా ఫీలవడం, భయపడటం వంటి మానసికస్థితి తలెత్తుతుంది. కొందరు ఈ స్థితి నుంచి త్వరగా బయటపడతారు. మరికొందరు మాత్రం ఆ పరిస్థితిలోనే ఉండిపోతారు. అంటే నిత్యం భయపడడమో, ఆందోళనకు గురవడమో, ఒంటరిగా ఫీలవడమో చేస్తుంటారు. ఇవన్నీ డిప్రెషన్‌ లక్షణాలు. ఒకప్పుడు యుక్తవయసువారిలో, పెద్దల్లో మాత్రమే ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు పిల్లలు కూడా దీని బారిన పడుతుండటం విచారకరం. డిప్రెషన్‌కు గురవుతున్న చిన్నారుల శాతం ప్రతి ఏటా పెరుగుతోంది.
 
అయితే, మానసిక ఒత్తిడి బారిన పడటానికి కారణాలేంటి అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే... పిల్లల్లో డిప్రెషన్‌ సాధారణమే అయినా, దీనికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ రోజులు అనారోగ్యానికి గురవుతుంటే, తమ శారీరక స్థితిని చూసి వారు ఆందోళన చెందుతారు. తోటిపిల్లల్లాగా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నందుకు బాధపడతారు. ఆరోగ్యం కోసం వాడే మందుల వల్ల శరీరంలోని రసాయనాల్లో మార్పుల వల్ల కూడా డిప్రెషన్‌ రావొచ్చు. 
 
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలు కూడా డిప్రెషన్‌కు కారణం. అంటే తల్లిదండ్రులు నిత్యం గొడవపడటం, పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, తల్లి లేదా తండ్రి ఒక్కరి పర్యవేక్షణలోనే పెరగడం, సరైన ఆదరణ లేకపోవడం వంటివి సైతం డిప్రెషన్‌కు దారితీస్తాయి. పాఠశాలలో తోటివిద్యార్థుల నుంచి వేధింపులు, ఇతరత్రా హింసకు గురైన వారు ఈ సమస్య బారిన పడతారు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన అంశాలు కూడా కారణమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు