అంతెందుకు మనం ఇప్పుడు వాడుతున్న చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్‌ను మొక్కలు, చెట్లకు చెందిన ఆకులు, పండ్లు, వేర్ల నుంచే తయారు చేస్తారు. నిజానికి మొక్కలు ఇంట్లో పెంచుకోవడానికి అన్నివిధాలుగా అనుకూలంగా ఉండాలి. ఎండ పడకపోయినా, తరచూ నీళ్లు పోయకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా.. చక్కగా పెరిగి అందంగా కనిపించాలి.. అని కోరుకునే వారికి అనువైంది ఎమరాల్డ్ పామ్.
నిజానికి ఇది పామ్ మొక్క కాదు. ఆకుల అమరిక, రంగుని బట్టి మాత్రమే దీనికా పేరు వచ్చిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని శాస్త్రీయనామం జామియో కల్కస్ జామిఫోలియా. అందువల్ల దీన్ని జేడ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఆఫ్రికాలోని జాంజిబార్ దీని జన్మస్థలం కావడం వల్ల దీన్ని జాంజిబార్ జెమ్ అని కూడా పిలుస్తారు. దీనిని అన్ని చోట్లల్లోను అలంకరణ మొక్కగా పెంచుకోవచ్చు.
ఈ మొక్క యొక్క అంగుళం దాదాపు ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. దీని ఆకులు ముదురాకుపచ్చరంగులో ప్రకాశవంతంగా, నూనె రాసినట్లు నున్నగా మెరుస్తుంటుంది. దీనిని చూడగానే కృత్రిమ మొక్కేమో అన్న సందేహం కలుగక మానదు. దీని ఆకుల్లో, కాడల్లో నీరు నిల్వ ఉంచుకుంటుంది. ఒకటి రెండు నెలల పాటు నీళ్లు పోయకపోయినా కూడా తట్టుకోగలిగే శక్తి దీనికుంది. ఎండ సూటిగా పడకుండా ప్రకాశవంతమైన వెలుతురు ఉండే చోటు దీనికి అత్యంత అనుకూలం.
ఎమరాల్డ్ పామ్‌కు చీడపీడలు ఆశించే సమస్య దాదాపు తక్కువే. నెలకోసారి 19:19:19 చొప్పున ఎన్‌పీకే ఉండే నీటిలో కరిగే సమగ్ర ఎరువును తక్కువ మోతాదులో కానీ, వర్మివాష్‌ని గానీ పోస్తూ ఉంటే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే ఆకు నుంచి మొక్క తయారవడానికి సుమారు యేడాది కాలం పడుతుంది. ఎమరాల్డ్ పామ్‌కు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో దీని ఆకులను, వేర్లను చెవిపోటుకి, అల్సర్లకు మందుగా వాడతారు. అంతేకాదు, హానికారక రసాయనాలను తొలగించి గాలిని పరిశుభ్రం చేయగల శక్తి కూడా ఈ మొక్కకు ఉంది.