బాదం పప్పును నీటిలో నానబెట్టి తింటే...

బుధవారం, 31 జులై 2019 (13:46 IST)
బాదంపప్పు అంటే ఇష్టం లేనివాళ్లుండరు. రుచితో పాటు బాదం గుండెకు చాలా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్-ఇ, రాగి, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలలోని బయో యాక్టివ్ మాలిక్యూల్స్ గుండెకు మేలు చేస్తాయి. పీచుపదార్థం, ఫైటోస్టిరాల్స్, యాంటి ఆక్సిడెంట్లు బాదంలో సమృద్ధిగా ఉన్నాయి.
 
బాదం పప్పులో కొవ్వు అధికంగానే ఉంటుంది. కాకపోతే ఇందులో గుండెకు మేలు చేసే కొవ్వుపదార్థాలు చాలా ఉన్నాయి. అందువల్ల క్రమం తప్పకుండా బాదంపప్పు తినటం గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయిలు పెరగటానికీ బాదం ఉపయోగపడుతుంది. అందువల్ల నిద్ర బాగా పట్టడానికి తోడ్పడుతుంది. 
 
ముఖ్యంగా వీటిల్లోని పీచు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రక్తప్రసరణను సైతం మెరుగుపరుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి అవేంటో చూద్దాం. 
 
నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. 
 
బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు. బాదంపప్పుల్లోని రైబోఫ్లేవిన్ విటమిన్, ఎల్-కామిటైన్‌లు మెదడుకు పదును పెడతాయి. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. 
 
బాదం గింజల్లోని సూక్ష్మపోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి రోజూ బాదం తీసుకునేవారిలో ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. బాదంను ఏ రూపంలో తీసుకున్నా చర్మం సౌందర్యం మెరుగుపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు