రంగు రంగుల కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ, ఒంటికీ కూడా విందు చేస్తుంది. మామిడి, బొప్పాయి, క్యారెట్లు, చిలగడ దుంప వంటి పసుపు, నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటాకెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
విటమిన్-ఏ లోపం రాకుండానే కాదు, క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక మసాలా దినుసులు, పసుపు, గ్రీన్‌టీ, బత్తాయి, నారింజ వంటి పండ్లు, దుంపలు, కూరగాయల్లో అధికంగా ఉండే బయోఫ్లావనాయిడ్లు గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇక టమోటా, పుచ్చకాయ, ద్రాక్ష, అంజీరా వంటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపేన్.. కణాల్లో ఒత్తిడిని తగ్గించే ‘యాంటీ ఆక్సిడెంట్’గా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరిగేందుకూ దోహదపడుతుంది. అందుకే రంగు, రంగుల కూరగాయలు, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.