మధుమేహం, చక్కెర వ్యాధి, డయాబెటిక్.. పేరు ఏదయితేనేం.. ఆ విషయంలో మనదే రికార్డు. ప్రపంచ మదుమేహ వ్యాధిగ్రస్తుల రాజధాని ఇండియాయే మరి. మన జనాభాను ఆవహిస్తున్న ప్రమాదకర జబ్బుల్లో మధుమేహానికే అగ్రస్థానం. ఏటా పది లక్షలమంది భారతీయులు మదుమేహంతోనే తీసుకు చస్తున్నారని గణాంకాలు. దీన్ని అరికట్టే మార్గమే లేదా అంటే లేకేం, బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు వైద్యులు. అదేమిటంటే.. కొండల్లో జీవించటం.
అసలు మదుమేహం ఎందుకొస్తుంది. చిన్ని పిల్లల్లో కూడా అంది ఎందుకు అంతగా విస్తరిస్తోంది. అంటే జీవించే తీరును, జీవనశైలిని మనం అంత గొప్పగా వెలగబెడుతున్నామట. ఇక డయాబెటిస్ మాత్రమే కాదు. ఏ రోగమైనా మనిషికి రాక చస్తుందా అంటున్నారు వైద్యులు. మీ రోగానికి మీరే కారకులు భద్రం అంటున్నారు. ప్రపంచంలోని మిగతా దేశాల్లో కంటే 15 సంవత్సరాలు ముందుగా మధుమేహం భారతీయుల్లో వ్యాపిస్తోందంటే ఇవే కారణమట.
వైద్యులు చెబుతున్న దానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి మరి. బాగా వేయించిన స్నాక్స్, ప్రతి పూటా లాగిస్తున్న జంక్ ఫుడ్స్, కోకోకాలాలు, వారంతపు మద్యపాన సేవనాలు, అతిగా పనిచేయడం, తక్కువగా నిద్రపోవడం, శారీకర శ్రమ ఏమాత్రం లేకపోవడం, ఇవన్నీ మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మన ఆరోగ్యంపై ప్రభావం చూపి తీరతాయట. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామన్నది రేపు మన ఆరోగ్యాన్ని నిర్ణయించే కొలమానమట.
తాజా పరిశోధనల ప్రకారం మీరు ఏ భౌగోళిక పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నది కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది. సముద్రమట్టానికి చాలా ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి మధుమేహం, గుండెపోటు, గుండె జబ్బుల వంటివి కలిగే అవకాశం తక్కువని స్పెయిన్ లోని నవర్రా యూనివర్శిటీ పరిశోధన తెలుపుతోంది. సముద్ర మట్టానికి సమానంగానూ దానిపై 121 మీటర్ల ఎత్తులోపు ప్రాంతాల్లో జీవించేవారికంటే సముద్ర మట్టానికి 457 మీటర్ల నుంచి 2,297 మీటర్ల మధ్య ప్రాంతంలో జీవించేవారికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని పరిశోధకులు అమయా లోపెజ్, పాస్కువల్ చెబుతున్నారు.