అల్పాహారంలో ఓట్స్.. వారానికి రెండుసార్లు చేపలు తింటే..?

శనివారం, 4 మార్చి 2017 (11:08 IST)
ఉదయం అల్పాహారంలో ఓట్స్‌ తీసుకుంటే ఎంతో మంచిది. ఇందులోని పీచు జీర్ణవ్యస్థకి మేలు చేయడంతోపాటు.. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.. దాంతో గుండె పనితీరు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే గుండెకు మేలు చేయాలంటే ఓట్స్‌తో పాటు స్ట్రాబెర్రీ, చేపలు, నిమ్మజాతి పండ్లు, సోయా తీసుకోవాలని వారు చెప్తున్నారు. 
 
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు హృదయ స్పందనలు అదుపు తప్పకుండా చూస్తాయి. గుండె కవాటాలు తెరుచుకుని ఉండటానికి దోహదం చేస్తాయి. ఫలితంగా గుండెలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. హృద్రోగాలూ దరిచేరవు. సోయా ఉత్పత్తుల్లో పాలీ శాచురేటెడ్‌ ఫ్యాట్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయని న్యూట్రీషన్లు చెప్తున్నారు. 
 
స్ట్రాబెర్రీల్లో ఆరోగ్యానికి మేలు చేసే పైటోన్యూట్రియంట్లు, ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సరిగ్గా సాగేలా చేస్తాయి. రక్తనాళాలు మూసుకుపోకుండా ఉంచుతాయి. గుండెకు సక్రమంగా రక్తప్రసరణ జరిగి ఎలాంటి సమస్యలూ దరిచేరవు. ఇక విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నిమ్మ, కమలా, నారింజ, బత్తాయి వంటి వాటిని నిత్యం తీసుకోవడం మంచిది. విటమిన్‌ సి గుండె పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి