నానాటికీ పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ వాడకం వల్ల చిన్నారులతో పాటు... యువతీ యువకులకు కూడా 'డ్రై ఐ డిసీజ్' ముప్పు పెరుగుతోందని నేత్ర వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు బయటకెళ్లి ఆడుకోవడంకంటే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందరే గడపడం ఎక్కువైంది. దీనివల్ల కళ్లు పొడిబారడం సహా పలు వ్యాధులకు కారణం అవుతోందని వారు హెచ్చరించారు.
ఈ మేరకు చిన్నపిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వాడకంపై దక్షిణ కొరియాలోని ఛుంగ్ యాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 916 మంది చిన్నారుల నేత్రాలను పరీక్షించినట్లు తెలిపారు. వీరిని రెండు బృందాలు (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు)గా విడదీసి వారి అలవాట్లను అడిగి తెలుసుకున్నారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులలో స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వాడకం 61.3 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 51 శాతం ఉంది. డీఈడీ ముప్పు విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు 8.3 శాతం ఉండగా, గ్రామీణ చిన్నారులలో 2.8 శాతంగా ఉందని పరిశోధకులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది డ్రై ఐ డిసీజ్‌తో బాధపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది యుక్తవయసులో ఉన్నప్పుడు ప్రభావం చూపక పోయినప్పటికీ.. వృద్ధాప్యంలో దృష్టిలోపానికి దారితీస్తుందని వారు హెచ్చరించారు.