ఆ మూడు కలిస్తే అధిక రక్తపోటు(బీపీ) సమస్య వున్నవారి ప్రాణాలకే ముప్పు

మంగళవారం, 5 నవంబరు 2019 (21:21 IST)
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాల్లో అధిక రక్తపోటు, పొగతాగడం, అధిక బరువు... ఈ మూడు కారణాలవుతున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. విశేషం ఏంటంటే... ఈ మూడు సమస్యలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ శ్రద్ధ చూపకపోవడంతో మరణాలు క్రమంగా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీపి(అధిక రక్తపోటు) సమస్య పురుషులు, స్త్రీలలోనూ అధికంగానే ఉన్నట్లు గుర్తించారు. అసలు బీపీ అధికమై మరణానికి దారితీసేందుకు కారణాలిలా వున్నాయి. 
 
మొదటిది మద్యం... ఎవరైతే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని తీసుకోరాదు. ఐతే కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల హృద్రోగ సమస్యలు రాకుండా నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ మద్యం ఎక్కువగా తీసుకుంటే అది ప్రాణానికే ముప్పు తెస్తుంది. మద్యం తీసుకోవడం వల్ల అప్పటికే ఉన్న రక్తపోటు స్థాయిని మరింత పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంగా రక్తనాళాలు పాడైపోవడం జరుగుతుంది. దీనితో చికిత్స కూడా క్లిష్టతరంగా మారుతుంది. పరిస్థితి ఇలా ఉండటం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. 
 
రెండవది ఉప్పు.... ఉప్పు తీసుకోవడం వల్ల కొందరిలో వెంటనే రక్తపోటు పెరిగిపోతుంది. ఐతే మరికొందరిలో అంతటి మార్పు కనబడదు. ఐతే బీపీ వున్నవారు ఉప్పు తీసుకోవడాన్ని ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఉప్పు తీసుకోవడం తగ్గించనట్లయితే రక్తపోటు పెరిగి అది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సోడియం స్థాయిని దాదాపు తగ్గించుకుంటే బీపీ రోగులకు ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే... ఒక స్థాయిని మించి రెండో స్థాయికి బీపీ చేరుకున్నదంటే అది మూత్రపిండాలను పాడు చేస్తుంది. కాబట్టి నియంత్రణ చాలా చాలా ముఖ్యం. తేలికగా తీసుకోరాదు.
 
ఇక మూడవది.... కొవ్వు పదార్థాలు... కొవ్వు పదార్థాలేమిటో మనకు తెలుసు. వాటిని దూరంగా పెట్టేయాలి. సాచ్యురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్-ఫ్యాట్లను ఖచ్చితంగా దూరంగా పెట్టేయాలి. ఇవి రెండూ గుండెకు, రక్త నాళాలను పాడు చేయడంలో ముందుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అధిక రక్తపోటు కారణంగా రక్త నాళాలు, గుండె ఎంతో ఒత్తిడికి గురై ఉంటాయి. ఈ స్థితిలో వాటిపై కొవ్వులు కూడా దాడి చేస్తే ఇక అన్నీ కలిసి ప్రాణం తీసేందుకు సిద్ధమైపోతాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఎర్ర మాంసం, వేరుశనగ పప్పు నూనె, నేయి... తదితర కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించాలి. అప్పుడే రక్తపోటును నియంత్రించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు