ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తంలో లోతైన అవగాహన ఉంది: రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్

శుక్రవారం, 1 నవంబరు 2019 (19:42 IST)
2019 నవంబర్ 1 సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ నగర పాలక క్రీడా ప్రాంగణం ఆవరణలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో గౌరవ గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా దీనిని నిర్వహించింది. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ... సభికులు అందరికి నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆసీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. 
 
గొప్ప చారిత్రక సంస్కృతి, వారసత్వం కలిగిన రాష్ట్రానికి నేను గవర్నర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈ రాష్ట్రం ఎందరో నిబద్ధత కలిగిన నాయకులను దేశానికి అందించింది. ‘ఆంధ్రులు ఒక అద్భుతమైన గతాన్ని కలిగి ఉన్నారు. చారిత్రాత్మకంగా ఐతరేయ బ్రాహ్మణంలో ‘ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. శాతవాహనులతో ప్రారంభించి, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులతో సహా వివిధ ఆంధ్ర రాజ వంశాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించాయి.
 
ఆంధ్రుల చరిత్రలో క్రీస్తు శకం 624 నుండి 1323 మధ్య ఏడు శతాబ్దాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ కాలంలో తెలుగు భాష ప్రాకృత, సంస్కృత ఆధిపత్యం నుండి బయటపడి స్వదేశీ సాహిత్య మాధ్యమంగా ఉద్భవించింది. తత్ఫలితంగా, ఆంధ్రదేశం ప్రత్యేక గుర్తింపును సాధించటమేకాక, భారతీయతలో తనదైన ప్రత్యేకతను అపాదించుకుంది. 
 
కాకాటియస్, బహమణి, విజయనగర్, కుతుబ్ షాహి, మొఘల్ రాజుల పాలన ద్వారా ఆంధ్ర ప్రాంతం యొక్క మధ్యయుగ చరిత్ర వెలుగు చూసింది. కాలానుగతంగా ఆసాఫ్ జాహిస్, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ పాలన ఇక్కడి ప్రజలకు సంక్రమించగా, తదుపరి స్వాతంత్ర్య పోరాటం వచ్చింది. అహింసా, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఆలంబనగా దేశవిముక్తి ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను తరమి కొట్టాలన్న మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకు ఆంధ్రా ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు.
 
నిజానికి 1921 జనవరిలో జరిగిన చీరాల -పెరాలా సంఘటన ఆంధ్ర ప్రాంత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో చెప్పుకోదగ్గ సంఘటనగా నిలిచింది. నాటి పాలకులకు పురపాలక పన్ను చెల్లించడానికి నిరాకరించినందుకు ఒక వృద్ధ మహిళతో పాటు పలువురికి బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. ఆ వృద్ధ మహిళే రాజకీయ కారణాలతో జైలు శిక్ష అనుభవించిన మొదటి మహిళగా గుర్తించబడటం విశేషం.
 
అప్పట్లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు గాంధీజీ రాగా, ఈ సంఘటనే ఆయన స్వయంగా చీరాలను సందర్శించడానికి ప్రేరేపించింది. 1922లో ఆంగ్లేయులపై అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఏజెన్సీ ప్రాంతాలలో జరిగిన సాయుధ తిరుగుబాటు ఆంధ్రా స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో మరో గొప్ప సంఘటన. గాంధీజీ విజయవాడను ఆరుసార్లు సందర్శించగా, 1920లో జరిగిన విజయవాడ సమావేశంలో మహాత్మా గాంధీజీతో పాటు కస్తూర్బా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి అనేక మంది ముఖ్య నాయకులు పాల్గొనగా, నాటి ప్రసంగాలు, వారి పోరాట పటిమ ఆంధ్ర ప్రాంత నాయకులపై గొప్ప ప్రభావాన్ని చూపి, వారిని స్వాతంత్ర్య పోరాటం దిశగా ప్రేరెపించాయి.
 
స్వాతంత్ర్యం తరువాత మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం చేర్చగా, గాంధేయ మార్గంలో రాష్ట్ర విభజన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పొట్టి శ్రీరాములు అమరుడు కాగా, ఆ తరువాతే మద్రాస్ నుండి విభజించబడింది. పొట్టి శ్రీరాములు అత్యున్నత త్యాగం మరువలేనిది. 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్ష ప్రారంభించిన అమరజీవి డిసెంబరు 15న మృతి చెందటం నాడు ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఫలితంగానే 1953 అక్టోబరు 1న మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం విడివడింది.
 
ఆంధ్ర ప్రాంతాన్ని వివిధ రాజవంశాలు, సామ్రాజ్యాలు పరిపాలించగా, ఆయా సంస్కృతులు, సంప్రదాయాలు ఈ వైవిధ్యమైన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని రూపొందించడంలో చెరగని ప్రభావాన్ని చూపాయి. ఏది ఏమైనప్పటికీ 1956 నవంబర్ 1న ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయిక్త రాష్ట్రంగా అవతరించడానికి ముందే ఈ రాష్ట్రం చాలా పరిణామాలను చూసింది.
 
ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తంలో లోతైన అవగాహన ఉంది. ప్రజా సంక్షేమం, సంపూర్ణ నిబద్ధత, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, వికేంద్రీకృత పరిపాలనతో నూతన రాష్ట్రాన్ని అద్భుతంగా నిర్మించగలరనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతున్న  ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగటం ముదావహం అని అన్నారు గవర్నర్ బిశ్వభూషణ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు