#WorldIdliDay మార్చి 30, ఏంటి సంగతి?

శుక్రవారం, 30 మార్చి 2018 (17:19 IST)
ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, చెట్నీతో ఇడ్లీ, కారం పొడితో ఇడ్లీ... ఇలా ఎన్నో రకాలుగా ఇడ్డెనలు తింటుంటాం. ఈ ఇడ్లీ ప్రాధాన్యత దృష్ట్యా వీటికీ ఓ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. అదే ప్రపంచ ఇడ్లీ దినోత్సవం. మార్చి 30న ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఎవరికి తోచిన ఇడ్లీలను... అంటే రకరకాల ఫ్లేవర్లలో ఇడ్లీలను తయారుచేసి సోషల్ మీడియా పైకి వదులుతున్నారు. 
 
ఇకపోతే చెన్నై సంప్రదాయ అల్పాహారంలో ఎన్నో పోషక విలువులున్నాయని అధ్యయనాలు తేల్చాయి. రెండు ఇడ్లీలు కప్పు సాంబారులో మిక్స్ చేసి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇడ్లీ-సాంబారులో కార్పొహైడ్రేట్స్, ఎనర్జీ, ప్రోటీన్స్, ఫ్యాట్స్, క్యాల్షియం వంటివి ఇందులో లభిస్తాయి. రెండు ఇడ్లీలు సాంబారుతో ఒక కాఫీ కూడా జతచేస్తే ఇంకా సూపర్.
 
చెన్నై సంపద్రాయ అల్పాహారం మిగతా మెట్రో నగర వాసుల అల్పాహారం కంటే పోషకసహితమని 'భారతీయుల అల్పాహార అలవాట్లపై అధ్యయనం' వెల్లడించింది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కత నాలుగు మెట్రోలలో 3,600 మందిపై నమూనా సర్వేగా దీనిని నిర్వహించారు. 
 
కోల్ కతా సంప్రదాయ అల్పాహారం ఎక్కువగా మైదాతో ఉంటుందట. దీనివల్ల కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నా, ప్రొటీన్ తక్కువని, ఫైబర్ అసలే ఉండదని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఢిల్లీ పరాటాలలో నూనె మరీ ఎక్కువని, ముంబై వాసులు ఎక్కువగా బ్రెడ్ తింటుంటారు. వీటిలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయన్నారు. 
 
ఇక ఇడ్లీ సాంబార్ విషయానికి వస్తే వీటిల్లో బియ్యం, మినప్పప్పు ఉండడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుందని, సాంబార్‌లో పప్పు, కూరగాయల ముక్కలు అన్నీ కలిపి ఆరోగ్యానికి పోషకరక్షణగా ఉంటాయని అధ్యయనకారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు