ఏసీ (Air Conditioner) లేకున్నా ఇల్లు చల్లగా పెట్టుకోవచ్చు.. ఎలా అంటే?
సోమవారం, 26 మార్చి 2018 (17:02 IST)
గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతోంది. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవటం.. దాంతో పగలు నీరసం, పనిపై ఏకాగ్రత లేకపోవటం వంటి అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. మరి వేసవిలో రాత్రి సమయంలో ప్రశాంతంగా, హాయిగా నిద్రపోవాలంటే ఇంటిలో వాతావరణ చల్లగా వుండాలి. చల్లగా వుండేందుకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఉపయోగిస్తుంటాం.. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, కరెంట్ చార్జీలు అదనంగా భరించాల్సిందే. పేదలు, మధ్యతరగతి వారు ఏసీలు, కూలర్లు కొనలేని పరిస్థితి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఖర్చు లేకుండానే.. ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. దీంతో ఇల్లు చల్లగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఒకవేళ ఆర్థికంగా స్తోమత కలిగినవారు వాటిని కొన్నా కరెంట్ ఖర్చులు తగ్గించుకోవచ్చు.. మరి అవేమిటో తెలుసుకుందామా..?
ఇంటి పైకప్పుకు కోటింగ్..
ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో అన్నింటికన్నా పైఅంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో వుండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి, సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు... అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది.
నార తెర చాపలతో చల్లదనం..
ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద నారతో చేసిన చాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా.. చాపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని.. వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండటం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్ షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు.
మొక్కలు పెంచితే అందం, ఆరోగ్యం, రక్షణ.. ఎన్నో ప్రయోజనాలు
ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్టుమెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి, చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక ఇండివిడ్యువల్ ఇల్లు అయి ఉండి.. ఇంటి చుట్టూగానీ, ముందు, వెనుకగానీ ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా.. ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేగాకుండా మనకు కావాల్సిన కూరగాయలు, పూలు వంటివీ మనమే పండించుకున్నట్లూ ఉంటుంది. మొక్కలు, చెట్లు ఉన్న ఇళ్లు, పరిసరాల్లో.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం..
గదిలో నేలను నీటితో కడగడం వల్ల ఆ నీరు మెల్లగా ఆవిరవుతూ గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పేయడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయడం మంచిది. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇంట్లో నేరుగా ఎండ పడని దిశల్లో ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి గాలి ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల కూడా చల్లదనం కలుగుతుంది. సాయంత్రం వాతావరణ చల్లబడిన తరువాత కిటికీలను తెరిచి ఉంచాలి. అందువల్ల ఇంట్లోని వేడి బయటికి వెళ్లిపోయి.. చల్లగాలి లోపలికి వస్తుంది.
వంటగదిలో జాగ్రత్తలు..
ఇక ఇంట్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వంట గదికి వెంటిలేటర్ ఉండేలా చూసుకోవాలి. ఈ వెంటిలేటర్లకు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు అమర్చుకోవాలి. లేకుంటే వంట గదిలోని వేడి ఇంట్లో నిండిపోతుంది.
మంచు గడ్డలు, నీటితో మ్యాజిక్..
ఏసీ లేకున్నా.. ఇంట్లోని ఏదైనా గదిలో బాగా చల్లదనం కావాలనుకుంటే మంచు గడ్డలు, చల్లని నీటితో సులువుగా వేడిని తగ్గించుకోవచ్చు. ఫ్రిజ్ లోంచి తీసిన ఐస్ క్యూబ్‌లను గానీ, చల్లటి నీటినిగానీ ఏదైనా వెడల్పాటి పాత్రలో పెట్టి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా అమర్చాలి. కొద్దిసేపటిలోనే గదిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడం గమనించవచ్చు. అయితే ఆ గదిలోకి బయటి నుంచి వేడి గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. అప్పుడు చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది. ఐసు లేకున్నా.. మామూలు నీటిని వెడల్పాటి పాత్రలో పోసి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా పెట్టినా కూడా ఆ గదిలో రెండు మూడు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.
శరీరాన్నీ చల్లగా ఉంచుకునే పదార్ధాలు తీసుకోవటం ద్వారా..
మనం ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మన శరీరం వేడిగా ఉంటే ప్రయోజనం ఉండదు. అటు ఇంటిని చల్లగా ఉంచుకునే పని చేస్తూనే.. శరీరాన్ని చల్లబరిచేందుకు మంచి నీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటివి తాగడం బెటర్. ఎండాకాలంలో లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. అంతేగాకుండా వస్త్రాలు కొంచెం వదులుగా కూడా ఉండేలా చూసుకోవాలి. కాటన్ వస్త్రాల వల్ల గాలి బాగా ఆడి, చెమట ఆరిపోతుంది. తద్వారా శరీరం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. అందువల్ల నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీరు శరీరానికి అందితే.. చెమట కూడా ఎక్కువగా పట్టి శరీరం చల్లగా ఉంటుంది.
పడుకునే ముందు జాగ్రత్తలు..
రాత్రి పడుకునేందుకు కూడా బెడ్ పైన కాటన్ దుప్పట్లు, తలగడలకు కాటన్ గలీబులు వేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందుగానీ తలస్నానం చేయడంతో శరీరంలోని వేడి తగ్గి ఒకటి రెండు గంటల వరకు హాయిగా ఉంటుంది. నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడడంతోపాటు..హాయిగా వుండి నిద్ర కూడా బాగా పడుతుంది. ఇంట్లో చల్లదనాన్ని కలిగించేలా ఇటీవలే శాస్త్రవేత్తలు కొత్త తరహా పాలిమర్ ను అభివృద్ధి చేశారు. అది సూర్యరశ్మిని చాలా వరకు పరావర్తనం చెందించే ఈ పాలిమర్ ధర కూడా తక్కువే ఉంటుందని వారు చెబుతున్నారు. ఇళ్లు,కార్యాలయాలు, దుకాణాలు వంటి వాటిలో అన్ని చోట్లా ఈ పాలిమర్ పొరను వినియోగించుకోవచ్చని సైంటిస్టులు పేర్కొంటున్నారు. మరి అవి సామాన్యుడికి అందుబాటులో వుంటే వేసవికాలంలో కూడా ప్రశాంతమైన, హాయిగొలిపే జీవితాలను అందరూ ఆస్వాదించవచ్చు.