తెలుగు రాష్ట్రాలను నిపా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ అంతుచిక్కని వైరస్ బారినపడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఇదే కుటుంబంలోని మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరికొందరు ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ తరహా వైరస్‌ను దక్షిణాదిలో గుర్తించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కొద్దిరోజుల కిందట వీరంతా జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రులకు వచ్చారు. కొందరిలో మెదడువాపు లక్షణాలు కనిపించాయి. వ్యాధి లక్షణాలు వైద్యులకు అంతుపట్టకపోవంతో రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధినిర్ధారణ కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఈ ప్రాణాంతక వైరస్ ఆందోళన కలిగించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే కేరళకు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ట్వీట్ చేశారు. అధికారులను అప్రమత్తం చేసినట్టు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది.
ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ వెలుగులోకిరాని నిపా వైరస్ కేరళలో విజృంభిస్తుండటంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమయ్యాయి. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. నిపా వైరస్ దాదాపు స్వైన్‌ఫ్లూ లక్షణాలను పోలి ఉండటంతో తగిన చర్యలు చేపట్టాయి.