చక్కెర వ్యాధికి విరుగు కనిపెట్టండి: శాస్త్రవేత్తలకు వెంకయ్య పిలుపు

మంగళవారం, 29 మే 2018 (09:13 IST)
దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న చక్కెర వ్యాధిని శాశ్వతంగా నయం చేసే మందులను కనిపెట్టాలని దేశ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి, ఐఐఐఎం సోమవారం జమ్మూలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ వంటి వ్యాధుల నివారణపైనా దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో సైన్స్‌కు విశేషమైన స్థానం ఉందని, చౌకగా ఔషధాలు లభ్యం కావడంతోపాటు ఆహార భద్రత, పాలఉత్పత్తి, అంతరిక్షం తదితర రంగాల్లో తనదైన ముద్ర వేసిందని గుర్తుచేశారు. 
 
పరిశోధనలు ఖచ్చితంగా విద్యావ్యవస్థలో అంతర్భాగం కావాలన్నా రు. మన దేశాన్ని విజ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. ప్రతి విషయాన్నీ ప్రశ్నించి, వాటికి సమాధానాలు తెలుసుకొనేలా చిన్నారులు, యువతను ప్రోత్సహించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు