నా రెండేళ్ల పాప నా ఎడమ రొమ్ము పాలు తాగడంలేదు... డాక్టర్ అదేనన్నాడు...

బుధవారం, 28 అక్టోబరు 2015 (14:37 IST)
ప్రపంచంలో అత్యధికంగా కేన్సర్ వ్యాధి కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య భారతదేశంలోనూ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా స్త్రీలు రొమ్ము కేన్సర్ వ్యాధిని గుర్తించడంలో అవగాహన లేకపోవడంతో అది బాగా ముదిరిపోయిన తర్వాత ఆసుపత్రులకు వెళుతున్నారు. ఐతే త్వరితగతిన గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకు ఉదాహరణే ఈ తల్లి చెప్పిన ఘటన...
 
ఆమె అమెరికాలో ఓ ధనవంతురాలు. తన రెండేళ్ల చిన్నారి కుడి రొమ్ము నుంచి పాలు తాగుతోంది. కానీ తన ఎడమ రొమ్ము నుంచి వచ్చే పాలను తాగడం దాదాపు మానేసింది. ఇది గమనించిన ఆమె గైనకాలజిస్టును సంప్రదించింది. ఆమె పాప పాలు ఎందుకు తాగడం లేదో కనుగొనేందుకు ఆ ప్రాంతాన్నంతా పరిశీలించి చూసింది. ఆమె రొమ్ములో అక్కడక్కడా చిన్నచిన్న గడ్డలు ఉన్నాయి. అంతేకాదు... వాటి కారణంగా ఆమె ఎడమ రొమ్ము నుంచి వచ్చే పాలకు, కుడి రొమ్ము నుంచి వచ్చే పాలకు రుచిలో తేడా ఉండటం వల్లనే పాప తాగడంలేదు. పైగా వ్యాధి శరీరంలోని ఇతర ప్రాంతాలకు మెల్లగా విస్తరిస్తోంది.

వైద్యురాలికి అనుమానం వచ్చింది. వెంటనే కేన్సర్ టెస్ట్ కోసం ఆమె నమూనాలను సేకరించింది. ల్యాబ్ నుంచి నమూనాలు చూసి ప్రస్తుతం ఆ తల్లికి కేన్సర్ 3వ స్టేజి అని గుర్తించి విషయాన్ని ఆమెకు చెప్పింది. కానీ ఆ తల్లి అంగీకరించలేదు. తనకు కేన్సర్ రావడమేమిటి... అదెవరి రిపోర్టో అయి ఉంటుందని వాదించింది. కానీ మరికొందరు వైద్యులు వచ్చి అదే నిజం అని చెప్పారు. వెంటనే చికిత్సను మొదలుపెట్టి ఆమె శరీరంలో ఉన్న కేన్సర్ వ్యాధిని పూర్తిగా పారద్రోలారు. వ్యాధి నయమైన తర్వాత ఆ తల్లి తనను తన రెండేళ్ల పాప బతికించిందని గుండెలకు హత్తుకుంది. అలా ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
 
ప్రస్తుతం భారతదేశంలోనూ కేన్సర్ వ్యాధిపై అవగాహన లేదు. ఉన్నవారు కూడా తమకు కేన్సర్ కాదేమోనని అశ్రద్ధ చేస్తున్నారు. శరీరంలో ఎక్కడైనా కణితులు, చిన్నచిన్న గడ్డలు, మార్పులు వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకుంటే... ఒకవేళ కేన్సర్ ఉన్నట్లయితే ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే తగ్గించడం చాలా సులభం. కేన్సర్ వ్యాధి అనగానే భయపడిపోయి పరీక్షలు చేయించుకోవడానికి వెనుకడుగు వేయకూడదు. అలా చేయడం వల్ల ప్రాణాన్నే పణంగా పెట్టినట్లవుతుంది.

వెబ్దునియా పై చదవండి