ఉల్లిపాయి గురించి అందరికి తెలిసిన విషయమే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత మనకు తెలిసిందే. పేదవాడి కూర ఉల్లిచారు. దీనినే పచ్చిపులుసు అని కూడా అంటారు. ఆ చారుకు చలువ చేసే గుణం వుంది. ఉల్లిపాయను తరుచు వాడటం వలన వీర్యము వృద్ధి అవుతుంది. ఉల్లిపాయను తరుచూ తీసుకోవడం వలన రక్తము శుద్ధి అవుతుంది. శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే ఆయాసము, జలుబు వంటి ఊపిరి తిత్తుల వ్యాధుల నుండి రక్షిస్తుంది.
గోంగూర పచ్చడి కలిగించే వేడిని ఉల్లిపాయను తినడం వలన వేడి తగ్గుతుంది. కడుపులో బల్ల పెరిగినా, కడుపుకు నీరు పట్టి బాగా ఉబ్బుతూ ఉంటే నీరుల్లిపాయను ఉడక బెట్టి ప్రతిపూట నాలుగేసి తింటుంటే వీటి నుండి బయటపడే అవకాశము ఉంటుంది. కీళ్ళనొప్పులు, వాపులు ఉన్నవారు, నీరు ఉల్లి పాయలను పొయ్యిలో వేసి కాల్చి మెత్తగా నూరి ఆ పదార్థంతో మందంగా పట్టు వేస్తే నొప్పులు తగ్గుతాయి.