గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే..

మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:26 IST)
దాల్చిన చెక్కను తరచుగా వంటకాల్లో వాడుతుంటాం. మసాలాల్లో కూడా చేర్చుతుంటాం. ఇది వంటకానికి మంచి రుచి, వాసన ఇస్తుంది. దీనిని వంటకాలలోనే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
సాధారణంగా మహిళలు రుతుసమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి బాధ నుంచి తప్పించుకోవాలంటే బియ్యం కడిగిన నీటిలో మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే సరిపోతుంది. ఒక్కోసారి కొంత మందికి గుండె పట్టేసినట్లు ఉంటుంది. ఆ సందర్భాలలో దాల్చిన చెక్కను చూర్ణం చేసి అందులో కొద్దిగా యాలకుల పొడి వేసి నీటిలో మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు. 
 
బాగా ఎండబెట్టిన దాల్చిన చెక్కను పొడి చేసి దానిలో కొద్దిగా నీరు కలిపి నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. 
 
కొద్దిగా తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి ఆ మిశ్రమాన్ని తీసుకున్నా లేదా చర్మానికి రాసుకున్నా దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా నుండి ఉపశమనం పొందవచ్చు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి, కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు