జుత్తుకు జామ ఆకుల వైద్యం... ఏంటి ఉపయోగం?

శుక్రవారం, 26 మే 2017 (17:26 IST)
జుత్తు పెరుగదలకు లేదా జుత్తు రాలే సమస్యను అరికట్టేందుకు మనలో చాలామంది రకరకాల షాంపూలు, నూనెలు, స్ప్రేలపై ఆధారపడుతుంటాము. ఎన్ని ఉపయోగించినా కనిపించని ఫలితం మనకు చాలా సాధారణంగా, చవకగా, ఎక్కడైనా దొరికే ఓ చెట్టు ఆకులతో ఇట్టే కనిపిస్తుందని మీకు తెలుసా? మెక్సికో, దక్షిణ అమెరికాల్లో పలు సంప్రదాయ ఔషధాల్లో ఉపయోగించే ఈ చెట్టు కాయలు, ఆకులను ఎలా ఉపయోగిస్తే మీ జుత్తు సమస్యను పోగొట్టుకోవచ్చో తెలుసుకోవాలనుందా? 
 
ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా, రసాయనాలు లేకుండా, చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన ఈ దివ్యౌషధం తయారీ విధానం ఇది - ఓ గుప్పెడు జామ ఆకులను లీటరు నీటిలో వేసి 20 నిమిషాలపాటు బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ ద్రావణం చల్లబడే వరకు అలాగే ఉంచండి. అంతే... మీకు కావలసిన ఔషధం తయారు చేసేసారు. మీరు తయారు చేసుకున్న ఈ ఉత్పత్తిలో ఎలాంటి రసాయనాలు, పొడులు ఉపయోగించవలసిన, కలపవలసిన అవసరం లేదు. దీన్ని తలస్నానం చేసిన తర్వాత జుత్తుని బాగా ఆరబెట్టి నేరుగా పట్టించవచ్చు. 
 
తలపై కనీసం 10 నిమిషాలు మర్దన చేయడం ద్వారా మీ జుత్తుకు మరింత ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. దీన్ని తలకు పట్టించేటప్పుడు జుత్తు కుదుళ్లపై బాగా దృష్టి పెట్టండి. దీన్ని పెట్టుకున్న తర్వాత 2 గంటలపాటు అలాగే వదిలేయండి. లేకుంటే రాత్రిళ్లు తలకు ఓ టవల్ చుట్టుకుని పడుకోవచ్చు కూడా. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ జుత్తుని కడగండి. మీ జుత్తుని వేడినీటితో శుభ్రపరచడం వల్ల మీ జుత్తు, తల పొడిబారుతుందని గుర్తుంచుకోండి.
 
మీకు జుత్తురాలే సమస్య ఉన్నట్లయితే ఈ ద్రావణాన్ని వారానికి మూడుసార్లు తలకు పట్టించండి. మీ జుత్తు వేగంగా పెరిగి, ప్రకాశవంతంగా కనిపించాలని అనుకుంటే వారానికి రెండుసార్లు పట్టించినా చాలు.

వెబ్దునియా పై చదవండి