ఆకుకూరలెంతో.. తమలపాకులంతే.. రోగనిరోధక శక్తిని పెంచుతాయా?

శనివారం, 16 జులై 2016 (13:30 IST)
పెళ్లైనా.. పేరంటమైనా.. ఏ శుభకార్యమైన ముందుండేది తమలపాకులు. భోజనం తర్వాత ప్రతియొక్కరు తప్పనిసరిగా సేవించేది తమలపాకులే. అయితే కాలక్రమేణా అది కనుమరుగైపోయింది. తమలపాకులనే కొన్ని ప్రాంతాల్లో నాగవల్లీ పత్రాలు అని కూడా అంటారు. రుచికే కాకుండా ఆరోగ్యపరంగానూ తమలపాకులతో ఎన్నో లాభాలున్నాయి. ఆరోగ్యపరంగా తమలపాకులు చేసే మేలును గుర్తించి ఇప్పుడు తెలుసుకుందాం...
 
ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్‌లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచటంలో అధ్భుతంగా పనిచేస్తుంది. పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా మేలు చేస్తుంది.
 
తమలపాలకును గోరువెచ్చగా చేసి దానికి ఆముదం రాసి గాయల మీద వేస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది. తమలపాకు రసాన్ని కొద్దిగా వేడి చేసి కొబ్బరినూనెతో కలిపి వెన్నుకు రాసి మర్ధన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత వ్యాధులతో సతమతమవుతుంటే తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
 
చెవుల మీద తమలపాకులను కట్టులా కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేసుకుంటే జలుబు వల్ల వచ్చే తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది. మలబద్దకంతో బాధపడుతుంటే తమలపాకులు తింటే సమస్య తీవ్రత తగ్గుముఖం పడుతుంది. తమలపాకు షర్బత్‌ని లాగా చేసి తాగితే గుండె బలహీనత తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి