చర్మవ్యాధులా.. అయితే కమలాఫలం తినండి...

మంగళవారం, 20 డిశెంబరు 2016 (12:54 IST)
సిట్రస్‌ జాతికి చెందిన కమలాఫలం. నారింజ, బత్తాయి, నిమ్మ వంటి ఏ ఫలాన్ని అయినా సరే వాడితే విటమిన్‌-సి పుష్కలంగా అందుతుంది. తక్షణమైన ఫలితం కావాలంటే పై ఫలాల రసంలో కాస్త ఉప్పు లేక పంచదార వేసుకుని తాగితే నిస్సత్తువపోతుంది. 
 
తరచూ జలుబుతో బాధపడేవారు కమలాఫలాన్ని తరచూవాడుతూ ఉంటే వారికి రోగనిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుతుంది. కామెర్ల రోగం వచ్చిన వారు పులుపు తినకూడదు అంటారు గానీ పైన వివరించిన ఫలాలలో దేనినైనా సరే రసం తీసి పంచదార కలుపుకుని తరచూ త్రాగుతుంటే కామెర్లు త్వరగా తగ్గిపోతాయి. 
 
నారింజ, కమలాఫలాల తొక్కలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ తొక్కలను పారెయ్యకుండా ఎండలో బాగా ఎండబెట్టి ఆ తర్వాత పొడిచేసి ఆ పొడిని వేడినీళ్లలో కలిపి స్నానం చేస్తే శరీరం తాజాగా సువాసనలు వెదజల్లుతోంది. చర్మవ్యాధులు కూడా తొలగిపోతాయి. 
 
ఎంతకూ మానని పుళ్ళు ఉన్న సందర్భంలో తరచూ కమలాఫలం తింటే పుళ్లు త్వరగా మానిపోతాయి. కమలాఫలం రోజుకు ఒకటి రాత్రి పడుకోబోయే ముందు తింటే ఉదయానికి సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం అలవాటుగా మారిన వారు ఈ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుంది. కమలాఫలం తరచుగా వాడటం వల్ల పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గుతుంది.
 
కమలాఫలంలో విటమిన్‌ సి మాత్రమే కాకుండా కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి. 0.8 గ్రాముల ప్రొటీన్లు, 0.3 గ్రాముల కొవ్వు పదార్ధాలు ఉన్నాయి. వీటితో పాటుగా 9 గ్రాముల పిండిపదార్థాలు కూడా ఉన్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది పైత్యాన్ని అరికడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. చలవ చేస్తుంది. దాహాన్ని అరికడుతుంది. 

వెబ్దునియా పై చదవండి