వెల్లుల్లిని అల్పాహారం కంటే ముందుగా తీసుకుంటే...?

శనివారం, 16 జులై 2016 (16:41 IST)
వెల్లుల్లి కూరలకు ఎంత అదనపు రుచినిస్తుందో ఆరోగ్యానికీ అంతే మేలు చేస్తుంది. అయితే దీన్ని ఇతర పదార్థాలతో కలిపి కాకుండా... పరగడుపున తీసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. మనం వంటకాల్లో తరచుగా వెల్లుల్లిని త‌క్కువ‌గా వాడుతుంటాము. ఇందులో బోలెడన్ని రసాయనాలు ఉన్నాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడానికి తోడ్పడుతున్నట్టు  అధ్యయనాల్లో తేలింది.
 
* వెల్లులి సహజ యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది. దీన్ని ఉదయం అల్పాహారం కంటే ముందుగా తీసుకోవడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా దూరమవుతుంది. అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల కాలేయం పనితీరు మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, ఆకలి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
 
* వెల్లులి  శరీరంలోని వ్యర్థాలనూ, క్రిముల్నీ బయటకు పంపేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇది చక్కని పరిష్కారం. ఆస్తమా, న్యుమోనియా వంటివి తరచూ బాధిస్తుంటే వెల్లుల్లిని ఆహారంలో తరచూ తీసుకుంటే మంచిది. అయితే కొందరి శరీరతత్వాన్ని బట్టి వెల్లుల్లి పడకపోవచ్చు. వెల్లుల్లి తీసుకున్నప్పుడు వేడి చేయడం, తలనొప్పి రావడం జరుగుతుంది. అలాంటి లక్షణాలు గమనించుకుని తక్కువ మోతాదులో తింటే సరిపోతుంది.
 
* వెల్లులిలో గంధక రసాయనాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. వీటికి ఒక రకమైన ఘాటు వాసనను తెచ్చి పెట్టేవి ఇవే. ఈ రసాయనాలు రక్తనాళాల్లో గార పేరుకోకుండా కాపాడతాయి. ఇక దీనిలోని అజోఎన్ రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతుంది. అలిసిన్ అనేది యాంటిబాక్టీరియల్, యాంటివైరల్, యాంటిఫంగల్‌గా పనిచేస్తుంది. ఇది పలురకాల ఇన్‌ఫెక్షన్స్ బారిన‌పడకుండా కాపాడుతుంది.
 
* ఇది రక్త నాళాలను సాగదీసేలా చేసి రక్తపోటు తగ్గేలా చేస్తుంది. తరచుగా జలుబు బారినపడేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. మన శరీరంలోకి ఇనుమును గ్రహించేలా చెయ్యడంలో వెల్లుల్లి ఎంతో  ఉపయోగపడుతుంది. కొన్ని రకాల కేన్సర్ నివారణకి వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి